
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభం.. ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు, దరఖాస్తుదారుల అనుమానాలను నివృత్తి చేయడం, వారికి అవసరమైన సమాచారాన్ని అందించడం కోసం టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సదుపాయం సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చింది.
Details
టోల్ ఫ్రీ సేవలు
హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి 1800 599 5991 టోల్ ఫ్రీ నంబర్‌తో కూడిన కాల్ సెంటర్, హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా లబ్ధిదారులు, దరఖాస్తుదారులు నేరుగా అధికారులను సంప్రదించవచ్చు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లే సౌకర్యం కల్పించారు.
Details
టైమింగ్స్ & సేవల విధానం
ఈ కాల్ సెంటర్ ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుంది. లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చొరవ చూపడం ప్రధాన ఉద్దేశం. లబ్ధిదారుల **ఫోన్ నంబర్, ఆధార్ వివరాల ఆధారంగా సమస్యలను పరిశీలించి చర్యలు చేపడతారు. బిల్లులు సమయానికి జమ కాకపోవడం, సిబ్బంది ఫోటోలను అప్‌లోడ్ చేయడంలో ఆలస్యం, ఇతర సాంకేతిక సమస్యలను ఇక్కడ తెలపవచ్చు. అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై కూడా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, చర్యలు తీసుకోవడమే కాక, ఫిర్యాదు స్థితి గురించి లబ్ధిదారులకు సమాచారం అందిస్తారు.
Details
మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా పూర్తి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు రూ.5 లక్షల సబ్సిడీతో ఇండ్లు నిర్మించడానికి సహాయం అందిస్తోందన్నారు. గూడు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు.