Chandrababu: జాతీయ అవార్డులతో టాలీవుడ్ జోరు.. విజేతలందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు
ఈ వార్తాకథనం ఏంటి
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సాధించిన విజేతలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతీయ సినీ రంగ ప్రతిష్ఠను మరింత పెంచడంతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృంద సభ్యులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కళ, సంస్కృతి, సినిమా అనేవి మన గుర్తింపునకు, సాంస్కృతిక వారసత్వానికి బలమైన స్తంభాలని పేర్కొన్నారు. తెలుగు సినిమా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, తన ప్రతిభతో రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
వివరాలు
మరిన్ని విజయాలు సాధించాలి
జాతీయ అవార్డులు అందుకున్న ప్రతి విజేతకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు, ప్రశంసలు దక్కాలని కోరుతూ తన బెస్ట్ విషెస్ తెలిపారు.
మరోవైపు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా అభినందించారు.
ముఖ్యంగా నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు.
అలాగే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో టాలీవుడ్ మొత్తం 9 పురస్కారాలు సాధించడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
కథ, నటన, సాంకేతిక నైపుణ్యం, కాస్ట్యూమ్ డిజైనింగ్, మేకప్, నిర్మాణ విలువలు వంటి అన్ని విభాగాల్లో తెలుగు సినిమా తన ప్రతిభను మరోసారి చాటుకుందని ఆయన కొనియాడారు.