
Cereals: భారతదేశంలో తగ్గిన తృణధాన్యాలు,పప్పుధాన్యాల వినియోగం
ఈ వార్తాకథనం ఏంటి
పుష్కర కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నట్టు ఇటీవల విడుదలైన కేంద్ర గణాంకశాఖ ఎన్‌ఎస్‌ఎస్ రిపోర్టు-594 'న్యూట్రిషనల్ ఇన్‌టేక్ ఇన్ ఇండియా' వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, తృణ ధాన్యాల వినియోగం భారీగా తగ్గినట్టు స్పష్టమైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 14 శాతం మేర తగ్గగా, పట్టణాల్లో 12 శాతం పడిపోయింది. అంతేకాదు, మాంసాహార పదార్థాల వినియోగంలో మాత్రం స్వల్ప వృద్ధి కనిపించింది. గ్రామాలు,పట్టణాల్లో కలిపి సగటున 6.5శాతం మేర మాంసం వినియోగం పెరిగినట్టు నమోదు అయింది. పప్పుదినుసుల వాడకంలో గ్రామీణ ప్రాంతాల్లో 0.4శాతం పెరుగుదల కనిపించినప్పటికీ, పట్టణాల్లో మాత్రం 1శాతం మేర తగ్గుదల కనిపించింది. ఇక పాలు,పాల ఉత్పత్తుల వినియోగం విషయానికి వస్తే,గ్రామీణ ప్రాంతాల్లో ఇది 1.6శాతం పెరిగింది.
వివరాలు
ఎక్కువ క్యాలరీలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ వృద్ధి కేవలం 0.4శాతం మాత్రమే. ఇతర సాధారణ ఆహార పదార్థాల వినియోగం కూడా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 5.7 శాతం,పట్టణాల్లో 6.8 శాతం మేర పెరిగింది. రోజువారీ తీసుకునే మొత్తం శక్తి (క్యాలరీలు) విషయంలో కూడా పెరుగుదల కనిపించింది. గత పుష్కర కాలంతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో 3శాతం,పట్టణాల్లో 5.5శాతం మేరగా క్యాలరీల తీసుకునే పరిమాణం పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా పరిశీలిస్తే,గ్రామీణ ప్రాంతాల్లో ఇది 6 శాతం,పట్టణాల్లో 2 శాతం మేర వృద్ధి చెందినట్టు వెల్లడైంది. మొత్తానికి, జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తలసరి ఎక్కువ క్యాలరీలు తీసుకుంటున్నట్టు ఈ గణాంకాల విశ్లేషణ స్పష్టం చేస్తోంది.