Supreme Court: దర్యాప్తులో జోక్యం సరికాదు: మమతా తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమ ధన మార్పిడి కేసులో రాజకీయ సలహా సంస్థ 'ఐప్యాక్'పై అమలులో ఉన్నఈడీ దర్యాప్తులో ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఆమె చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయని పేర్కొంది. బెంగాల్‌లో వెలుగుచూసిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అక్రమ ధన మార్పిడి కేసును అమలు సంచాలక విభాగం కొంతకాలంగా పరిశీలిస్తోంది. అయితే ఈ దర్యాప్తులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ అమలు సంచాలక విభాగం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
వివరాలు
మీ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి: సుప్రీం
ఈఅంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం,ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రవర్తనకు దిగుతారని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ఎప్పుడూ ఊహించి ఉండరని వ్యాఖ్యానించింది. "ఇది రాష్ట్రం,కేంద్రం మధ్య తలెత్తిన వివాదం కాదు.ఒక ముఖ్యమంత్రి నేరుగా దర్యాప్తులో జోక్యం చేసుకోవడం సమర్థించదగిన విషయం కాదు.ఈ అంశాన్ని రాష్ట్రం-కేంద్రం మధ్య ఘర్షణగా మలచకండి.మీ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి" అని మమతా బెనర్జీని ఉద్దేశించి న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు,డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అధికారులతో కలిసి అక్కడికి వెళ్లినట్లు కోర్టుకు తెలియజేశారు. 2021సంవత్సరం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఐప్యాక్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.