Gulmarg: గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో సాంకేతిక లోపం.. గాల్లోనే చిక్కుకున్న 300 మంది పర్యాటకులు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సేవల్లో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడటంతో భారీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గోండోలా కేబుల్ కార్లలో ప్రయాణిస్తున్న దాదాపు 300 మంది పర్యాటకులు గాల్లోనే నిలిచిపోయారు. సోమవారం పర్యాటకులు సాధారణంగా ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో కేబుల్ కార్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో అందులో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొన్ని గంటల పాటు ప్రయాణికులు గాల్లోనే చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
సాంకేతిక లోపం ఎలా తలెత్తిందనే అంశంపై దర్యాప్తు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సైన్యం, సహాయక బృందాలతో కలిసి రక్షణ చర్యలు ప్రారంభించారు. కేబుల్ కార్లలో చిక్కుకున్న పర్యాటకులను ఒక్కొక్కరిని సురక్షితంగా కిందకు దించారు. ప్రస్తుతం కేబుల్ కార్ వ్యవస్థను పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సాంకేతిక లోపం ఎలా తలెత్తిందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఘటనపై స్పందించిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.