Water Shortage: యమునా నదిలో విషపూరిత నురగలు.. దిల్లీ వాసులకు నీటి కష్టాలు
దిల్లీ ప్రజలకు గాలి కాలుష్యంతో పాటు నీటి కొరత సమస్య పెద్ద తలనొప్పిగా మారుతోంది. నగరంలోని యమునా నది కాలుష్యం కారణంగా దుర్వాసన వస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, మురుగునీటితో నది నీరు పూర్తిగా కలుషితమైపోయింది. ప్రస్తుతం నదిలో విషపూరిత నురగలు కనిపిస్తుండటంతో, అమ్మోనియా స్థాయి ప్రమాదకరంగా పెరిగిపోయింది. దీనివల్ల దిల్లీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా తీవ్రంగా తగ్గిపోయింది. నవంబర్ 1 వరకు తూర్పు, ఈశాన్య, దక్షిణ ఢిల్లీలో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని దిల్లీ జల్ బోర్డు ప్రకటించింది. భాగీరథి, సోనియా విహార్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు యమునా నీరుపై ఆధారపడినందున, కాలుష్యంతో నిండి ఉన్న నీటిని శుద్ధి చేయడం కష్టతరంగా మారింది.
ఆందోళనలో స్థానిక ప్రజలు
ఈ పరిస్థితుల కారణంగా నీటి ఉత్పత్తి 30 శాతం వరకు తగ్గిందని అధికారులు తెలిపారు. కాలుష్యం కారణంగా యమునా నది పూర్తిగా విషపూరితమైందని, అనేక పరిశ్రమల నుంచి వదిలిన మురుగునీరు ఈ పరిస్థితికి దారితీసిందని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. ఛట్ పూజ సమీపిస్తున్న వేళ, యమునా కాలుష్య సమస్య స్థానికులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. పండుగ వేళ నదిలో స్నానాలు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రజలు కలుషిత నీటితో పూజలు చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.