
వాన పేరుతో రైతులను మోసం చేసిన వ్యాపారులు
ఈ వార్తాకథనం ఏంటి
అకాల వర్షంతో పంట తడిసిపోయిందని రైతులు బాధపడుతుండగా.. ఈ నెపంతో వ్యాపారులు ధర తగ్గించి రైతులను మోసం చేశారు.
ఖమ్మంలో గురువారం ఉదయం భారీ వర్షం పడింది. దీంతో ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ లో అమ్మకానికి వచ్చిన మిర్చి బస్తాలు కొన్ని తడిసిపోయాయి.
దీన్ని వ్యాపారులు అదునుగా చేసుకొని మిర్చి తడిసిపోవడంతో నాణ్యత తగ్గిందని, చివరి కోత కావడంతో పనికి రాదని సాకులు చెబుతూ తక్కువ ధరకు మిర్చిని కొనుగోలు చేశారు.
దూరప్రాంతాల నుంచి వచ్చిన రైతులు చేసేది ఏమీ లేక వ్యాపారులు చెప్పిన ధరకు అమ్ముకొని బాధతో వెనుతిరిగారు.
మార్కెట్ కమిటీ లెక్కల ప్రకారం 23,780 బస్తాల మిర్చి విక్రయానికి వచ్చింది. జెండాపాటలో మిర్చి 23,051 ధర పలకడంతో రైతులు సంబరపడ్డారు.
Details
సిండికేట్ గా మారిన వ్యాపారులు
అయితే వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను తగ్గించేశారు. తడిసిన మిర్చిని కొనమని వ్యాపారులు తెగేసి చెప్పడంతో రైతులు ప్రాధేయపడాల్సి వచ్చింది. దీంతో క్వింటాకు ఏకంగా రూ.10వేల వరకు తగ్గించేశారు.
వ్యాపారులు ఎక్కువ మంది రైతుల నుంచి క్వింటా మిర్చిని రూ.13వేల నుంచి రూ.14వేల లోపు కొనుగోలు చేశారు. మరోవైపు బస్తాకు మూడు కిలోల చొప్పున తరుగును తీశారు. అయితే కాంటా సమయంలో బస్తా మిర్చికి కిలో చొప్పున మాత్రమే తరుగు తీయాల్సి ఉంది.
జెండా పాట రూ.23,051, కనిష్ట ధర రూ.12,500 పలికిందని, అయితే ఎర్రరకం మిర్చి ధరలు ఆశాజనకంగానే ఉన్నాయని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.