
Goa Stampede: జాతరలో విషాదం.. గోవా ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
గోవా రాష్ట్రంలోని శిర్గావ్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
అక్కడ ఉన్న శ్రీ లైరాయ్ దేవాలయంలో వార్షిక జాతర సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో శనివారం తెల్లవారుజామున ఘోరమైన తొక్కిసలాట జరిగింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
ప్రతేడాది జరిగే లైరాయ్ అమ్మవారి జాతర ఈసారి శుక్రవారం ప్రారంభమైంది. గోవా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
శనివారం తెల్లవారుజామున జరిగే 'నిప్పులపై నడిచే' ప్రత్యేక ఆచారానికి భారీగా భక్తులు హాజరయ్యారు.
Details
సహాయక చర్యలను ప్రారంభించిన పోలీసులు
ఈ నేపథ్యంలో జనం రద్దీ పెరగడంతో నియంత్రణ కోల్పోయిన భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ పడ్డారు. ఈ తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ నిర్వాహకులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.