హైదరాబాద్‌లో విషాదం: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. వీధికుక్కుల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన అతడి తండ్రి పనిచేసే స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. నిజామాబాద్ చెందిన గంగాధర్ కుటుంబం నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. అతనికి ప్రదీప్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆదివారం గంగాధర్ తన ఇద్దరు పిల్లలను తాను పనిచేసే ప్రాంతానికి తీసుకెళ్లాడు. ప్రదీప్ రోడ్డు మీద ఆడుకోవడానికి వెళ్లాడు. ఇదే సమయంలో గంగాధర్ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. అయితే ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేయడం ప్రారంభించింది. ఆ చిన్నారి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా కుక్కలు అతడిని వదల్లేదు. అతని శరీరాన్ని చీల్చేశాయి.
జీహెచ్‌ఎంసీ అధికారులపై నెటిజన్ల ఆగ్రహం
కొద్దిసేపటి తర్వాత తన కొడుకు కోసం గంగాధర్ బయటికి వెళ్లగా, కుక్కలు దాడి చేయడాన్ని గమనించాడు. వీధి కుక్కులను తరమికొట్టాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రదీప్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కొడుకును మెయిన్ రోడ్డుపై వదిలిపెట్టినందుకు కొంతమంది నెటిజన్లు తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది రోడ్లపై వీధి కుక్కలపై జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.