LOADING...
Kushinagar: కుషీనగర్‌ 'చైత్ బర్నీ' జాతరలో స్వింగ్ రైడ్ ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు
కుషీనగర్‌ 'చైత్ బర్నీ' జాతరలో స్వింగ్ రైడ్ ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు

Kushinagar: కుషీనగర్‌ 'చైత్ బర్నీ' జాతరలో స్వింగ్ రైడ్ ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖడ్డా ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తున్న 'చైత్ బర్నీ' జాతరలో ఏర్పాటు చేసిన స్వింగ్ రైడ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఆనందం క్షణాల్లోనే భయానకంగా మారింది. రైడ్‌లో ఉన్న సందర్శకులు గాల్లో ఊగుతున్న సమయంలోనే అది తెగిపడటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో కళకళలాడుతున్న జాతర ప్రాంగణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వేగంగా తిరుగుతున్న స్వింగ్ రైడ్ అకస్మాత్తుగా విరిగి నేలకూలడంతో అందులో ఉన్నవారు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు వెంటనే స్పందించి, సహాయక చర్యలు ప్రారంభించారు.

వివరాలు 

ఎమ్మెల్యే స్పందన

పోలీసులు కూడా తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు హుటాహుటిన తరలించారు. ఈ ఘటనపై ఖడ్డా నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద్ పాండే స్పందించారు. 'ఘటన తెలిసిన వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశాం. బాధితులకు ఉత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. స్వల్ప గాయాలున్నవారికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నవారిని జిల్లా ఆసుపత్రికి తరలించాం' అని తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

వివరాలు 

దర్యాప్తు ప్రారంభం

ఇక ఈ ప్రమాదం సాంకేతిక లోపం కారణంగా జరిగిందా లేదా నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అందరూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జాతర ప్రాంగణం వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్వింగ్ రైడ్ విరిగి సందర్శకులకు గాయాలు

Advertisement