Drone in vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా.. ట్రయల్ రన్ కు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం
ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో ఆహారం సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటి అత్యవసర సరుకులను చేరవేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. బోట్లు, హెలికాప్టర్లు వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఈ డ్రోన్లను వినియోగించడం ద్వారా ఆహార సరఫరా చేయడానికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే విజయవాడ కలెక్టరేట్ వేదికగా మూడు డ్రోన్లతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ డ్రోన్లు ఒక మినీ హెలికాప్టర్‌లా ఉండి, ఎంత బరువును మోయగలవు? ఏయే ప్రదేశాలకు సులభంగా చేరుకోవచ్చో అనే అంశాలపై ట్రయల్ రన్ సమయంలో పరిశీలన జరిగింది.
ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం
ముఖ్యంగా,మార్గంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా, వాటిని సులభంగా తప్పించుకునే సామర్థ్యాన్ని ఈ డ్రోన్లు చూపాయి. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ట్రయల్‌ను పర్యవేక్షించారు. ట్రయల్ ఫలితాల ప్రకారం, ఈ డ్రోన్లు సుమారు 8 నుంచి 10 కిలోల వరకు ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటి సరుకులను తీసుకెళ్లగలవు. ఈ ప్రక్రియ విజయవంతమైతే మరిన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం మూడు డ్రోన్లతో ట్రయల్ నిర్వహించినప్పటికీ, ఇంకా ఐదు డ్రోన్లు సిద్ధంగా ఉంచారు.
వరద సహాయక కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
ఇదిలా ఉండగా, నేవీ హెలికాప్టర్లు వరద సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటివరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. నిరాశ్రయుల కోసం 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో వరద కారణంగా 17 చోట్ల తెగిపోయిన రహదారులను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి.