
Aircraft Crash: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో శిక్షణ విమానం కూలి పైలట్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలీ జిల్లాలో భయానకమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో శిక్షణలో ఉన్న ట్రైనీ పైలట్ తన ప్రాణాలను కోల్పోయాడు. ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం, ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
ప్రమాద సమయంలో ఆ శిక్షణ విమానం ఓ నివాస ప్రాంతం మీదకు వచ్చి కూలింది, ఫలితంగా తీవ్ర మంటలు వ్యాపించాయి.
మొదట ఒక చెట్టుపై కూలిన ఆ విమానం, అనంతరం ఓ ఖాళీ స్థలంలోకి దూసుకెళ్లింది.
ఈ దుర్ఘటన అమ్రేలీ పట్టణంలోని గిరియా రోడ్డులో ఉన్న రెసిడెన్షియల్ ఏరియాలో చోటు చేసుకుంది.
మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
శిక్షణ విమానం ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీ నిర్వహిస్తోంది
ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు.అమ్రేలీ జిల్లా ఎస్పీ సంజయ్ ఖారత్ మాట్లాడుతూ,సంఘటనా స్థలంలోనే ట్రైనీ పైలట్ మరణించినట్టు వెల్లడించారు.
పైలట్ తానే ఒంటరిగా ఆవిమానాన్ని నడుపుతున్నట్లు గుర్తించారు.ఈవిమానం అమ్రేలీ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్నట్లు అధికారికంగా నిర్ధారించారు.
ఈశిక్షణ విమానం ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీ నిర్వహిస్తున్నదిగా తెలుస్తోంది.
ఈ అకాడమీ అమ్రేలీ ఎయిర్‌పోర్ట్ నుంచి పైలట్లకు శిక్షణను అందిస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
అలాగే అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
విమానం నివాస ప్రాంతంలో కూలినా,అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి గాయాలు కాలేదు.