Visakhapatnam: డేటాసెంటర్ల అవసరాల కోసం ట్రాన్స్‌కో మెగా ప్లాన్.. 15 గిగావాట్ల లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలో ఏర్పాటు కానున్న భారీ డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. డేటా సెంటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2034 నాటికి 15 గిగావాట్ల విద్యుత్ సరఫరా సామర్థ్యం కలిగిన నెట్‌వర్క్‌ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఒడిశా వైపు నుంచి వచ్చే జాతీయ విద్యుత్ గ్రిడ్‌తో ఏపీ ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌ను అనుసంధానించేలా కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే విద్యుత్‌ను ఉత్తరాంధ్రలో వినియోగించుకునే అవకాశం ఏర్పడనుంది.
వివరాలు
డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు గ్రీన్ సిగ్నల్
అదే విధంగా రాయలసీమలో ఏర్పాటు కానున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఉత్తరాంధ్రకు తరలించేందుకు రూ.21,800 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన గ్రీన్ ఎనర్జీ కారిడార్‌తో కూడా ఉత్తరాంధ్ర ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను అనుసంధానించనున్నారు. ప్రస్తుతం గూగుల్, రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (హైపర్‌వాల్ట్), కంట్రోల్‌ఎస్ వంటి ప్రముఖ సంస్థలు విశాఖ ప్రాంతంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇంధన శాఖ అంచనాల ప్రకారం విశాఖ ప్రాంతంలో ప్రతిపాదిత డేటా సెంటర్లకు మాత్రమే సుమారు 9.1 గిగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది.
వివరాలు
ఇంధన శాఖ అంచనాలు
2036-37 నాటికి ఈ ప్రాంతంలో మొత్తం విద్యుత్ డిమాండ్ 15 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ట్రాన్స్‌కో నెట్‌వర్క్ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు, సబ్‌స్టేషన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించింది. పెందుర్తి, మరడాం, అచ్యుతాపురం, పలాస, పద్మనాభం, మాకవరపాలెం ప్రాంతాల్లో నెట్‌వర్క్ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి 765 కేవీ, 220 కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అలాగే తర్లువాడ, ముడసర్లోవ, పోలిపల్లి, చిన్నిపాలెం ప్రాంతాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్న సంస్థలు స్వయంగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని చేపట్టనున్నాయి.
వివరాలు
అందుబాటులోకి కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు
రాంబిల్లి డేటా సెంటర్ క్లస్టర్ అభివృద్ధిపై ట్రాన్స్‌కో ప్రత్యేకంగా దృష్టి సారించింది. కాకినాడ ఎస్‌ఈజెడ్ పరిధిలోని 400 కేవీ సబ్‌స్టేషన్ నుంచి అనకాపల్లి జిల్లా పెందుర్తి మండలంలోని కల్పక, అచ్యుతాపురం, రాంబిల్లి సబ్‌స్టేషన్లను అనుసంధానించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఇందుకోసం ప్రత్యేక ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఇదిలా ఉండగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) పెందుర్తిలో 765 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు చేపడుతోంది. ఒడిశాలోని అంగుల్, శ్రీకాకుళం, వేమగిరి సబ్‌స్టేషన్లను అనుసంధానించేలా నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఈ క్రమంలో పద్మనాభం వద్ద 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ట్రాన్స్‌కో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
వివరాలు
మాకవరపాలెంలో 765 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు
మాకవరపాలెంలో 765 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ సబ్‌స్టేషన్‌ను పెందుర్తి, కాకినాడ సబ్‌స్టేషన్లతో అనుసంధానించనున్నారు. అలాగే ఒడిశాలోని అంగుల్ నుంచి వచ్చే ట్రాన్స్‌మిషన్ లైన్‌ను శ్రీకాకుళంలోని 765 కేవీ సబ్‌స్టేషన్‌కు, అక్కడి నుంచి పలాసలో ప్రతిపాదిత 400 కేవీ సబ్‌స్టేషన్‌కు అనుసంధానిస్తారు. దీనివల్ల ఉత్తరాంధ్ర జిల్లాలకు జాతీయ విద్యుత్ గ్రిడ్‌తో ప్రత్యక్ష కనెక్టివిటీ లభించనుంది. మాకవరపాలెంలోని 765 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు పద్మనాభం, పలాస ప్రాంతాల్లో ప్రతిపాదించిన 400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ విస్తరణ పనులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశముందని భావిస్తున్నారు.