Page Loader
Free bus in AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి కీలక ప్రకటన.. విధి విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడి
ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి కీలక ప్రకటన

Free bus in AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మంత్రి కీలక ప్రకటన.. విధి విధానాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2024
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో మహిళలు, విద్యార్థులు, రైతులకు లాభాలు ప్రకటించింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒకదాని తర్వాత ఒకటి హామీలను నెరవేర్చుతున్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి పథకాలు అమలు చేశారు. దీపావళి నుంచి మరో పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ముఖ్యంగా, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని దీపావళి నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా చర్చకు వచ్చింది.

వివరాలు 

త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ 

అయితే, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై కీలక వ్యాఖ్యలు చేసారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆయన ఉచిత బస్సు ప్రయాణ హామీని త్వరలోనే అమలు చేస్తామన్నారు. పథకానికి సంబంధించిన విధివిధానాలు రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమవుతుందని వార్తలు వెలువడ్డాయి. కానీ వరదల కారణంగా ఈ పథకం అమలు వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం ప్రారంభం కాబోతుండటంతో, ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా త్వరలో అమలు చేసే అవకాశం ఉంది.

వివరాలు 

దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు 

ఆదివారం, రాయచోటి నియోజకవర్గంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఆయన దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించబడతాయని చెప్పారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రభుత్వం లక్ష్యమని, డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.