Seaplane: విజయవాడ - శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్' ఏర్పాటుకు సన్నాహాలు.. 9న మరో అద్భుత ప్రయోగం
పర్యాటక రంగంలో విజయవాడ కొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఈ నెల 9న పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం వరకు ప్రయాణించే 'సీ ప్లేన్' ప్రయోగాన్ని ప్రారంభించనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ ప్రయాణం విజయవంతమైతే, రెగ్యులర్ సర్వీసు ప్రారంభించే అవకాశం ఉంది. పున్నమిఘాట్ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి మెరుగులు దిద్దుతున్నారు. శనివారం సీ ప్లేన్ శ్రీశైలం పయనించనుంది. శ్రీశైలం పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ఉన్న పాత జెట్టీ వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో నూతన ప్రయోగాలు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రం పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల జాతీయ స్థాయిలో డ్రోన్ సమిట్ నిర్వహించిన ప్రభుత్వం, ఇప్పుడు సీ ప్లేన్ ప్రయోగం చేపడుతోంది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో సీ ప్లేన్ ప్రయోగం ఆలోచన వచ్చినప్పటికీ, వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టుకు పురోగతి లేకపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఈ ప్రయోగం మళ్లీ ప్రారంభమైంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ సీ ప్లేన్ ప్రయోగాన్ని చేపడుతున్నారు.
రెండో దశలో మరిన్ని ప్రాంతాలకు..
దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లన్న ఆలయ సందర్శకులకు ఈ సీ ప్లేన్ ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి వంటి ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలను రెండో దశలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.