Page Loader
ఏపీలో దారుణం.. హాస్టల్లో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లి చంపిన దుండగులు
ఏపీలో దారుణం.. హాస్టల్లో నిద్రిస్తున్న బాలుడ్ని ఎత్తుకెళ్లి చంపిన దుండగులు

ఏపీలో దారుణం.. హాస్టల్లో నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లి చంపిన దుండగులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 12, 2023
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వసతిగృహంలో ఉంటూ నాలుగో తరగతి చదువుకుంటున్న ఓ గిరిజన విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుట్టాయగూడెం మండలం పులిరాముడు గూడెంలో అర్ధరాత్రి జరిగింది.కొండరెడ్డి తెగకు చెందిన గోగుల శ్రీనివాస రెడ్డి వాలంటీరగా పనిచేస్తున్నారు. కాగా ఆయన భార్య రామలక్ష్మి ఆశా కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. మన్యంలోని మారుమూల గ్రామం ఉర్రింకకు చెందిన ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి ఆరో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడు అఖిల్‌ వర్ధన్‌రెడ్డి పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ వసతిగృహంలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అయితే అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు వసతిగృహం లోనికి ప్రవేశించి విద్యుత్ సరఫరా నిలిపేశారు.

details

పీక నొక్కి, కళ్లపై గుద్ది చంపినట్లు మృతదేహంపై ఆనవాళ్లు

అనంతరం అఖిల్‌వర్ధన్‌రెడ్డిని బయటికి ఎత్తుకెళ్లారు. అనంతరం బాలుడ్ని పీక నొక్కి, కళ్లపై గుద్ది హత్యచేశారు. ఈ మేరకు మృతదేహంపై ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. బతకుమీద ఆశలున్న వాళ్లు ఇక్కడ్నుంచి వెళ్లిపోండి. ఇకపై ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇట్లు మీ ××× అని ఓ లేఖ రాసి బాలుడి చేతిలో ఉంచారు. విషయం తెలుసుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ మేరీప్రశాంతి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలపై ఆరా తీసి పాఠశాలను పరిశీలించారు. బాధిత తండ్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలవరం డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. నిందితుల కోసం డాగ్‌ స్క్వాడ్‌తో గాలింపు చర్యలను ముమ్మురం చేశామని పేర్కొన్నారు. మరోవైపు కుమారుడి హత్య నేపథ్యంలో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు.

details

ఘటనపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులంతా సస్పెండ్

బాలుడ్ని పథకం ప్రకారమే చంపేశారా, లేక ఎవరైనా కావాలని ముందస్తు ప్లాన్ ప్రకారమే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల మధ్య గొడవలు, మృతుడి కుటుంబంలో పాత కక్షలు ఏమైనా ఉన్నాయేమోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గదిలోకి చొరబడటం పట్ల ఓ విద్యార్థి స్పందించాడు. విద్యుత్ నిలిపేయడం తాను చూశానని, అయితే భయంతోనే చెప్పలేకపోయినట్లు ఓ విద్యార్థి వెల్లడించాడు. వాచ్‌మన్‌ విధుల్లో లేకుండా బయటకు వెళ్లినట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. తాను పాత భవనంలోని ఓ గదిలో నిద్రిస్తున్నట్లు వాచ్‌మన్‌ పేర్కొన్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నగంగరాజు, ఉపవార్డెన్‌ శ్రీనివాస్‌, వాచ్‌మన్‌ రాజేష్‌లను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు.