TS EAMCET-2023: తెలంగాణ ఎంసెట్‌కు పరీక్షాల కేంద్రాల పెంపు; భారీగా పెరిగిన అప్లికేషన్లు
తెలంగాణ ఎంసెట్ -2023 కోసం రికార్డు స్థాయిలో అప్లికేషన్లు పెరిగినట్లు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)- హైదరాబాద్ పేర్కొంది. అప్లికేషన్లకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను పెంచాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ పరీక్షల కోసం 20పైగా అదనపు ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గతేడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 109 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ ఏడాది 130పైగా సెంటర్లలో పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో అనేక ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నందున కొత్త కేంద్రాలను ఇప్పటికే గుర్తించినట్లు జేఎన్‌టీయూ-హైదరాబాద్ అధికారి ఒకరు తెలిపారు.
ఎంసెట్ కోసం 3.16లక్షలకుపైగా అప్లికేషన్లు
అదనపు సెంటర్లలో ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్, బఫర్ సిస్టమ్‌లతో పాటు కంప్యూటర్ల లభ్యత పరిశీలన పూర్తైనట్లు సమాచారం. దీనికోసం టీసీఎస్ సహకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ పరీక్షను ఆరు సెషన్లలో, అగ్రికల్చర్, మెడికల్(ఏఎం) పరీక్ష నాలుగు సెషన్లలో షెడ్యూల్ చేశారు. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 కోసం 3,16,848 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇంజనీరింగ్ కోసం దరఖాస్తులు 30,500 పైగా పెరిగాయి. ఇంజనీరింగ్ కోసం గత సంవత్సరం 1,72,238 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ సంవత్సరం 2,02,815 మంది అప్లై చేశారు. ఏఎం స్ట్రీమ్ కోసం నమోదు చేసుకున్న వారి సంఖ్య కూడా 2022లో 94,476 ఉండగా, ఈ ఏడాది 1,13,671కి పెరిగాయి.