రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 1 పరీక్ష ఆదివారం జరగనుంది. పేపర్ లీకేజీతో రద్దు అయిన పరీక్షను కమిషన్ ఆదివారం ( జూన్ 12న ) మరోసారి నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గ్రూప్-1 సర్వీస్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 503 పోస్టులకు నిర్వహించనున్న ఈ పరీక్ష ఉదయం 10.30 - 1 మధ్యాహ్నం వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తామని కమిషన్ పునరుద్ఘాటించింది. ఈ మేరకు జిల్లాల ఉన్నతాధికారులతో కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి సమీక్షించారు. అనంతరం అధికార యంత్రాంగానికి పరీక్ష నిర్వహణకు సంబంధించిన సూచనలు ఇచ్చారు.
ఓఎంఆర్‌పై ప్రశ్నపత్రం కోడ్‌ను తప్పనిసరిగా రాయాలి : టీఎస్‌పీఎస్సీ
పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు వచ్చేటప్పుడు హాల్ టికెట్‌తో పాటు ఏదైవా ఓ ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. మొత్తం 3,80,052 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. గత అక్టోబర్ లో నిర్వహించిన ప్రిలిమ్స్ ను దాదాపు 2.86 లక్షల మంది అభ్యర్థులు రాశారు. దాదాపుగా 2.75 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని కమిషన్ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ కోసం 994 పరీక్ష కేంద్రాలను సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అయితే ఓఎంఆర్ షీట్ పై ప్రశ్నపత్రం కోడ్‌ను కంపల్సరీగా రాయాలని సూచించింది. ఈ కీ ఆధారంగానే వాల్యుయేషన్ చేయనున్నట్లు స్పష్టం చేసింది.