
US B-2 Bombers: హిందూ మహాసముద్రంలో అలజడి.. మోహరించిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత అధునాతన, ప్రమాదకరమైనగా గుర్తింపు పొందిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో మోహరించాయి.
అమెరికా వద్ద ఉన్న 20 బీ-2 బాంబర్లలో ఆరు విమానాలను ఇండో-పసిఫిక్ ప్రాంతానికి తరలించిందని తాజా ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి.
ఇదంతా జరుగుతుండగా, ప్రపంచ దేశాలపై ట్రంప్ విధిస్తున్న సుంకాలతో వాణిజ్య వాతావరణం వేడెక్కుతుండగానే మౌనంగా అమెరికా భారీ స్థాయిలో సైనిక మోహరింపును కొనసాగిస్తోంది.
హిందూ మహాసముద్రంలో ఎన్నడూ లేని విధంగా B-2 బాంబర్ల మోహరింపునకు పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ఈ బాంబర్లు అమెరికా-బ్రిటన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డియెగో గార్సియాలోని సైనిక స్థావరంలో నిలిపి ఉంచారు.
Details
విమాన వాహక నౌకల సంఖ్యను మూడుకు పెంచాలి
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విమాన వాహక నౌకల సంఖ్యను ఒకటి నుంచి మూడుకు పెంచాలని అమెరికా ఆదేశించింది.
ఇందులో రెండు హిందూ మహాసముద్రంలో, ఒకటి పశ్చిమ పసిఫిక్‌లో ఉండనుంది. ఇది దక్షిణ చైనా సముద్రానికి సమీపంగా ఉండటం గమనార్హం.
అమెరికా ఈ చర్యలను ప్రాంతీయ భద్రత కోసమే తీసుకుంటున్నదని పెంటగాన్ వెల్లడించింది, మిత్రదేశాలు కూడా దీనికి మద్దతు ప్రకటిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అమెరికా ఎప్పటిలాగే ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవడం పశ్చిమాసియా దేశాల్లో ఆగ్రహానికి దారి తీస్తోంది.
ముఖ్యంగా ఇరాన్ మద్దతుతో యెమెన్‌కు చెందిన హౌతీలు ఇటీవల అమెరికా వ్యాపార వాహనాలు, సైనిక నౌకలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే.
దీంతో అమెరికా వైమానిక దాడులు చేపట్టినప్పటికీ హౌతీలు తమ దాడులను కొనసాగిస్తున్నారు.
Details
అణు ఒప్పందంపై ఇరాన్ నిరాకరణ
ఇక మరోవైపు, అణు ఒప్పందం పై ఇరాన్ నిరాకరణ తెలిపింది. దీని పట్ల తీవ్రంగా స్పందించిన ట్రంప్, అవసరమైతే ఇరాన్‌పై అత్యంత ప్రమాదకరమైన బాంబుల వాడకాన్ని తప్పనిసరిచేస్తామని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే, హిందూ మహాసముద్రం, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో B-2 బాంబర్ల మోహరింపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం తాజా పరిణామాల నేపథ్యంలో ఏ సమయంలోనైనా ఘర్షణాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది ప్రపంచ స్థాయిలో భద్రతా పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.