Orvakal: ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు గల కారణాలు ఏమిటి . .అక్కడే ఎందుకు?
ఓర్వకల్లులో డ్రోన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం పలు కారణాలపై ఆధారపడి ఉందని పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక హబ్ ద్వారా డ్రోన్ తయారీ పరిశ్రమలు, పరీక్షా సదుపాయాలు ఏర్పడతాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో జరిగిన డ్రోన్ సదస్సులో "ఏపీ డ్రోన్ ఎకోసిస్టం"పై ప్రణాళికను ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ,ఈ డ్రోన్ హబ్‌లో శిక్షణ,సర్టిఫికేషన్,అసెంబ్లింగ్ యూనిట్లు,రిపేర్లు,నిర్వహణ వంటి వివిధ సేవలు అందుబాటులోకి రాగలవని,దీనివల్ల కొత్త పరిశ్రమలు పెరిగే అవకాశముందని వివరించారు. రాష్ట్రంలో డ్రోన్ వ్యాపారాలు ప్రారంభించడానికి అవసరమైన అనుమతులను సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఓర్వకల్లులో హబ్ ఏర్పాటు చేయడం వలన కలిగే ప్రయోజనాలు:
కర్నూలు విమానాశ్రయంలోని రన్‌వేను డ్రోన్ పరీక్షల కోసం వినియోగించుకోవచ్చు. డ్రోన్ పరిశ్రమకు అవసరమైన అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుకు 10,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్-బెంగళూరు నగరాలకు సమీపంలో ఉండటంతో, వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ అనుమతులు తీసుకునే బాధ్యతను ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించడంతో, డీజీసీఏ అనుమతులు అవసరం లేకుండా, విమానాల నిర్వహణ సులభతరం అవుతుంది.
అవకాశాలను అందిపుచ్చుకోవడానికే..
ఈ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని సురేష్‌కుమార్ అన్నారు. దేశంలో డ్రోన్ రంగం ప్రస్తుతం 3% స్థాయిలో ఉందని, కేంద్రం దీన్ని 20%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నదని ఆయన తెలిపారు. మ్యాపింగ్, సర్వే, వ్యవసాయం, ఫొటోగ్రఫీ, తనిఖీలు, నిఘా వంటి విభాగాల్లో డ్రోన్‌ల వినియోగం విస్తరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం ఐదు సంవత్సరాల్లో డ్రోన్ రంగం ద్వారా రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుని, రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో 12,500 మందికి ఉపాధి కల్పించాలని భావిస్తున్నదని తెలిపారు.