
INDIA Bloc: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి రేసులో తుషార్ గాంధీ.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫీవర్ ఎక్కువ అవుతోంది. నామినేషన్ దాఖలు చేసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో కసరత్తులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ తమ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరును ప్రకటించింది. ఇప్పుడు ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ అభ్యర్థి ఖరారు చేసే దశకు వచ్చింది. ఎన్డీఏ దక్షిణాది వ్యక్తిని ఎంపిక చేయడం వెనుక తమిళనాడు ఎన్నికల్లో లబ్ది పొందడమే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. అదే దారిలో ఇండియా కూటమి కూడా దక్షిణాదినే దృష్టిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం ఢిల్లీలో జరగనున్న ఇండియా బ్లాక్ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారయ్యే అవకాశముంది. రేసులో రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
Details
మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ
మహాత్మాగాంధీ మునిమనవడు, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత తుషార్ గాంధీ, అలాగే తమిళనాడుకు చెందిన మాజీ ఇస్రో శాస్త్రవేత్త ఎం. అన్నాదురై. వీరిలో ఎవరినైనా ఎంపిక చేసే అవకాశముందని సమాచారం. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తినే అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రతిపక్షం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తుషార్ గాంధీ పేరును ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రతిపాదించారని సమాచారం. అయితే తమిళనాడు వ్యక్తికే టికెట్ ఇవ్వాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. దాంతో అన్నాదురై పేరును డీఎంకే ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయాన్ని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖర్జున ఖర్గేకే వదిలేసినట్లు చెబుతున్నారు.
Details
గెలుపు కోసం 392 ఓట్లు కావాలి
ఈసారి తృణమూల్ కాంగ్రెస్ కూడా రాజకీయ సంబంధం లేని అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చింది. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వనప్పటికీ, ఈసారి తమ అభిప్రాయాలకు అనుగుణంగా పేర్లు ఉన్నాయని టీఎంసీ స్పష్టంచేసింది. వాస్తవానికి తిరుచ్చి శివ పేరు కూడా పరిశీలనలోకి వచ్చిందిగానీ, టీఎంసీ అభ్యంతరం కారణంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే గణాంకాలను పరిశీలిస్తే ఉపరాష్ట్రపతి పదవిపై ఎన్డీఏ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం ఉభయ సభల సభ్యులు 782 మంది ఉండగా, గెలుపుకోసం 392 ఓట్లు కావాలి.
Details
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక
ప్రస్తుతం ఎన్డీఏ బలం 422 ఓట్లు. వీరిలో లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది సభ్యులు ఉన్నారు. అయినప్పటికీ, ప్రతిపక్ష కూటమి తమ ఐక్యతను చాటిచెప్పే ప్రయత్నంలో భాగంగా పోటీలోకి దిగుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఇదే సమయంలో ఎన్డీఏ ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇండియా బ్లాక్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తికి మద్దతు ఇవ్వలేమని ప్రతిపక్షం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.