TVK: ఎమ్మెల్యేల కోసం రిసార్ట్ బుక్ చేసిన టీవీకే
ఈ వార్తాకథనం ఏంటి
తమిళగ వెట్రి కగజం (టీవీకే) తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ అనూహ్యంగా ముందంజలో దూసుకెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం నటుడు విజయ్‌కు చెందిన ఈ పార్టీ 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వంద స్థానాల మైలురాయిని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టీవీకే పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది. గెలిచే ఎమ్మెల్యేలను ఒకేచోట ఉంచేందుకు ఇప్పటికే రిసార్ట్‌ను బుక్ చేసినట్లు సమాచారం. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టీవీకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
గెలిచే అభ్యర్థులను సురక్షితంగా ఉంచుకోవడం లక్ష్యంగా..
మల్లాపురం ప్రాంతంలో ఉన్న పుంజేరి ప్రైవేటు రిసార్ట్‌ను సుమారు వంద మంది ఎమ్మెల్యేల కోసం ముందుగానే బుక్ చేసినట్లు సమాచారం. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా బరిలోకి దిగింది. అయితే ఎడప్పాడి ప్రాంతంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థికి మాత్రమే మద్దతు తెలిపింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల నేపథ్యంలో పార్టీ అధినేత విజయ్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఈ పరిస్థితిలో గెలిచే అభ్యర్థులను సురక్షితంగా ఉంచుకోవడం లక్ష్యంగా రిసార్ట్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థులతో విజయ్ ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. ఎమ్మెల్యేల వ్యవహారాలను అదవ అర్జున సమన్వయం చేస్తున్నారు.