Page Loader
కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్ 
కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్

కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్ 

వ్రాసిన వారు Stalin
Aug 23, 2023
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. బోర్డు పరీక్షలను రెండుసార్లు రాయడంతో పాటు ఆయా సబ్జెక్టుల్లో సాధించిన ఉత్తమ స్కోరును ఎంచుకొనే అవకాశాన్ని కూడా విద్యార్థులకు కేంద్రం అందించింది. కొత్త కరికులం ఫ్రేమ్‌వర్క్ (NCF) ప్రకారం, 11, 12 తరగతుల విద్యార్థులు తప్పనిసరిగా రెండు భాషలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి కచ్చితంగా భారతీయ భాష అయి ఉండాలని కేంద్రం వెల్లడించింది. కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)కి అనుగుణంగా విద్యావ్యవస్థలో భారీ స్థాయిలో మార్పులు ఉంటాయని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు 2024 అకడమిక్ ఇయర్ కోసం ప్రత్యేక పుస్తకాలను కూడా కేంద్ర విద్యాశాఖ సిద్ధం చేస్తోంది.

విద్యా

ఎన్‌సీఎఫ్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

11, 12వ తరగతుల్లోని సబ్జెక్టుల ఎంపిక విద్యార్థులు తమ అభిరుచులకు అనుగుణంగా ఎంపిక చేసుకునే వెసులుబాటును నూతన విద్యా విధానం ద్వారా కేంద్రం అందించనుంది. ప్రస్తుతం తరగతి గదిలో బట్టి చదవులకు స్వస్తి పలకాలని విద్యాశాఖ యోచిస్తోంది. అందులో భాగంగానే నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎన్‌సీఈఆర్టీ మార్గదర్శకాల ఆధారంగా భారతీయ ఆలోచనలకు అనుగుణంగా విద్యాశాఖ పాఠ్యాంశాలను రూపొందించింది. నూతన విద్యా విధానం అమలు కోసం ఎన్‌సీఎఫ్ స్టీరింగ్ కమిటీని సిద్ధం చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కమిటీ ఫ్రేమ్‌వర్క్‌ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)కి అప్పగించామని ఆయన చెప్పారు.