Hyderabad Metro Second Phase: మెట్రో రెండోదశలో 2 ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లు.. అధికారులకు కొత్త సవాళ్లు
హైదరాబాద్ మెట్రో రోజు లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, ప్రతి రోజూ దాదాపు 5 లక్షల మంది ఈ మెట్రో సేవలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మూడు ప్రధాన మార్గాలు మెట్రో సేవలు అందిస్తున్నాయి: నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్. మెట్రోకు పెరుగుతున్న ఆదరణతో, రాష్ట్ర ప్రభుత్వం రెండవ దశ ప్రణాళికను రూపొందిస్తోంది.
ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు మెట్రో నిర్మాణానికి సవాలు
రెండో దశలో,కొత్త కారిడార్లను ప్రారంభించడానికి ప్రణాళికలు ఉన్నాయి. కారిడార్ 4లో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు, కారిడార్ 5లో రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, కారిడార్ 9లో ఆర్జీజీఐఎ (RGIA) నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు కొత్త ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లను నిర్మించనున్నారు, ఒకటి చాంద్రాయణగుట్టలో, మరొకటి ఎల్బీనగర్‌లో. ఈ ప్రదేశాల్లో ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు మెట్రో నిర్మాణానికి సవాలుగా మారాయి.
రెండు వేర్వేరు మార్గాలకు రెండు వేర్వేరు స్టేషన్లు
మెట్రో మొదటి దశలో అమీర్‌పేట జంక్షన్ అతిపెద్దగా ఉంది. ప్రతిరోజూ ఇది ప్రయాణికులతో కిటకిటలాడుతుంది, ఎందుకంటే కారిడార్ 1 ,3 ఇక్కడ కలుస్తాయి. ఇక ఎంజీబీఎస్ వద్ద కూడా మరో జంక్షన్ ఉంది. ఇక్కడి నుండి ప్రయాణికులు కారిడార్ 1, 2కు మారవచ్చు. పరేడ్ గ్రౌండ్ వద్ద మరో ముఖ్యమైన జంక్షన్ ఉంది, కానీ ఇక్కడ రెండు వేర్వేరు మార్గాలకు రెండు వేర్వేరు స్టేషన్లు ఉన్నాయి. రెండో దశలో,ఎల్బీనగర్ వద్ద ఒక పెద్ద ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ నిర్మించనున్నారు. నాగోల్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గం, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ కారిడార్ కలుస్తాయి.
ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ నిర్మించే ప్రణాళిక
ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్లు మెట్రో నిర్మాణానికి సవాలుగా ఉన్నాయి. చాంద్రాయణగుట్టలో కూడా అమీర్‌పేట మాదిరిగానే ఒక పెద్ద ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ నిర్మించే ప్రణాళిక ఉంది, ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా మెట్రోకు సవాలుగా మారింది. పరేడ్ గ్రౌండ్ వద్ద మొదటి దశలో వచ్చిన సవాళ్లు, రెండో దశలో ఎలా పరిష్కరిస్తారో త్వరలోనే స్పష్టత రానుంది.