దిల్లీలో కాంవడ్ యాత్ర విషాదం.. రెండు లారీలు ఢీ, నలుగురు దుర్మరణం
దేశ రాజధాని దిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలే దిల్లీలో భారీ వర్షాలకు ప్రజలంతా అల్లాడుతుంటే మరోవైపు రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. కాంవడ్ యాత్రలో పెను విషాదం సంభవించింది. ఓ ట్రక్కు అదుపు తప్పి డివైడర్‌ను దాటి హరిద్వార్ వెళ్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన ఉత్తర దిల్లీలోని అలీపూర్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు భారీ వాహనాలు (లారీలు) పరస్పరం ఢీ కొన్నాయి. దీంతో నలుగురు యాత్రికులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ప్రమాదంలో 15 మందికిపైగా యాత్రికులు గాయాలబారిన పడ్డారు.
దిల్లీలో యాత్రికులకు విషాదం
జీటీ (గ్రాండ్ ట్రంక్) కర్నాల్ మార్గంలో ఓ టూరిస్ట్ ట్రక్కు 20 మంది కాంవడ్ యాత్రికులతో హరిద్వార్ కు బయల్దేరింది. ఈ నేపథ్యంలోనే దిల్లీ నగరానికి వస్తున్న మరో ట్రక్కు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొంది. ఈ క్రమంలో యాత్రికుల లారీపైకి దూసుకెళ్లి ఘోర ప్రమాదానికి తీరిసింది. హుటాహుటిన బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు 15 మంది క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని దిల్లీ నార్త్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.