బీహార్: ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి.. స్కూల్ క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో మంగళవారం ఇద్దరు ఐదేళ్ల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పాఠశాల క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ IANS నివేదించింది. ఈ ఘటన బెగుసరాయ్‌లోని వీర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో చోటుచేసుకుంది. ఇద్దరు బాలికలను ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి ఇంటికి దింపేందుకు తీసుకెళ్లిన నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. IANS ప్రకారం, ఇంటికి వెళ్లే మార్గమధ్యంలో, నిందితుడు వాహనాన్ని ఏకాంత ప్రదేశంలో ఆపి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. లైంగిక వేధింపుల వీడియో క్లిప్పింగ్‌ను కూడా రూపొందించి, ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు
డ్రైవర్ నేరం చేసిన తర్వాత బాలికలిద్దరినీ వారి వారి ఇళ్ల వద్ద వదిలిపెట్టాడు. బాధితులు తమ తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపిన వెంటనే బాలికలలో ఒకరి కుటుంబ సభ్యులు డ్రైవర్‌ను వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పాఠశాల క్యాబ్‌కు నిప్పు కూడా పెట్టారు. వీర్పూర్ స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సదర్ బెగుసరాయ్ ఎస్‌డిపిఓ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుడికి మూడేళ్లుగా ప్రైవేట్ పాఠశాలతో సంబంధం ఉందని, తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.