Andhra Pradesh: నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్లు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో కీలక రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.9,889కోట్ల వ్యయంతో 198కిలోమీటర్ల మేర ఈ భారీ ప్రాజెక్టును శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఆమోదించారు. ఈ వివరాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హౌరా-చెన్నై అత్యంత రద్దీ రైల్వే మార్గాన్ని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు ఒడిశాలోని బాలేశ్వర్, భద్రక్, జఖపుర, హరిదాస్‌పుర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా, బ్రహ్మపుర వరకు నాలుగు లైన్ల పనులు పూర్తయ్యాయి.
వివరాలు
రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం
తదుపరి దశలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ విస్తరణ చేపట్టనున్నారు. అందులో భాగంగానే నిడదవోలు-దువ్వాడ మధ్య కొత్తగా రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్టణం, కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. అలాగే థర్మల్ విద్యుత్ కేంద్రాలు, సిమెంట్, స్టీల్ పరిశ్రమలు, రసాయన ఎరువులు, ఆహార ధాన్యాలు, బాక్సైట్, జిప్సం, సున్నపురాయి రవాణాకు పెద్ద ఊతం లభిస్తుంది. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల మీదుగా ఈ మార్గం విస్తరించనుంది. ఈ 198 కిలోమీటర్ల ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా గోదావరిపై 4.3 కిలోమీటర్ల పొడవైన భారీ రైల్వే వంతెన నిర్మించనున్నారు.
వివరాలు
8 కిలోమీటర్ల కొత్త అలైన్‌మెంట్ కూడా ఏర్పాటు
మొత్తం ప్రాజెక్టులో 3 మెగా వంతెనలు, 58 పెద్ద వంతెనలు, 416 చిన్న వంతెనలు, 73 రైల్వే అండర్‌పాస్‌లు (RUBs), 3 రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌లు (ROBs), 2.7 కిలోమీటర్ల పొడవైన వయాడక్ట్ నిర్మాణం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గం 130 శాతం సామర్థ్యంతో నడుస్తుండటంతో తరచూ రద్దీ, ఆలస్యాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా 3, 4 లైన్లు నిర్మించడం ద్వారా రద్దీ తగ్గి రవాణా సామర్థ్యం గణనీయంగా మెరుగవుతుంది. ఇప్పటి మార్గాలకు అనుసంధానంగా 8 కిలోమీటర్ల కొత్త అలైన్‌మెంట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం కారిడార్‌ను హైస్పీడ్ రైలు రవాణాకు అనుకూలంగా రూపకల్పన చేస్తున్నారు. అన్ని మార్గాల్లో 'కవచ్' భద్రతా వ్యవస్థ అమలు చేయనున్నారు.
వివరాలు
29 టన్నుల సరుకు రవాణా చేయలగే సామర్థ్యం
ప్రాజెక్టు పూర్తయితే అదనంగా 29 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయగల సామర్థ్యం పెరుగుతుంది. రోడ్డు రవాణా నుంచి రైలు రవాణాకు మళ్లడంతో ప్రతి ఏడాది సుమారు 51.5 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇది సుమారు 2 కోట్ల చెట్ల పెంపకానికి సమానమని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.1,151 కోట్ల సరకు రవాణా ఖర్చు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. నిర్మాణ సమయంలో 135 లక్షల మానవ పని దినాలు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పర్యాటక, పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుందని అంచనా.
వివరాలు
ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే భక్తులకు మరింత సౌకర్యం
ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇది స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల దిశగా కీలక ముందడుగని ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గి సమయం ఆదా అవుతుందని, అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరకు రవాణా మరింత వేగంగా, సమర్థవంతంగా జరగనుందని ఆయన పేర్కొన్నారు.