LOADING...
Visakhapatnam: త్వరలో భారత నౌకాదళంలోకి మరో రెండు అత్యాధునిక యుద్ధనౌకలు
త్వరలో భారత నౌకాదళంలోకి మరో రెండు అత్యాధునిక యుద్ధనౌకలు

Visakhapatnam: త్వరలో భారత నౌకాదళంలోకి మరో రెండు అత్యాధునిక యుద్ధనౌకలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సముద్ర సరిహద్దుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా నౌకాదళం మరో కీలక అడుగు వేయబోతోంది. సముద్ర రక్షణ సామర్థ్యాన్ని నిరంతరం విస్తరించుకుంటున్న భారత నౌకాదళం, త్వరలో మరో రెండు ఆధునిక యుద్ధనౌకలను సేవల్లోకి తీసుకురానుంది. ఇటీవల కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మూడు యుద్ధనౌకలు నౌకాదళంలో అధికారికంగా చేరగా, ఇప్పుడు ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి, ఐఎన్‌ఎస్‌ మాలవాన్‌లను దేశానికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

వివరాలు

కమిషనింగ్‌కు సిద్ధం..

ఈ ఏడాది జూన్‌ 20న కోల్‌కతాలో ఐఎన్‌ఎస్‌ అగ్రయ్, ఐఎన్‌ఎస్‌ సంశోధక్, ఐఎన్‌ఎస్‌ దునాగిరి యుద్ధనౌకలను అధికారికంగా నౌకాదళంలో ప్రవేశపెట్టారు. అదే కార్యక్రమంలో ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి, ఐఎన్‌ఎస్‌ మాలవాన్‌లను కూడా కమిషనింగ్‌ చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ, చివరి నిమిషంలో ఆ ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెలలోనే ఈ రెండు నౌకలను జాతికి అంకితం చేసే అవకాశం ఉందని నౌకాదళ వర్గాలు భావిస్తున్నాయి.

వివరాలు

ఐఎన్‌ఎస్‌ మాలవాన్‌..

సముద్రంలో జలాంతర్గాముల కదలికలను గుర్తించి ఎదుర్కొనేందుకు రూపొందించిన యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌గా ఐఎన్‌ఎస్‌ మాలవాన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నౌకను కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో నిర్మించారు. 2019 ఏప్రిల్‌ 30న భారత నౌకాదళం ఈ నౌక నిర్మాణానికి ఆర్డర్‌ ఇవ్వగా, 2023 నవంబర్‌ 30న జలప్రవేశం చేసింది. అనంతరం అన్ని నిర్మాణ, పరీక్షల ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత 2026 మార్చి 31న భారత నౌకాదళానికి అధికారికంగా అప్పగించారు.

Advertisement

వివరాలు

ప్రత్యేకతలు ఇవే..

ట్రిపుల్‌ జెట్‌ వాటర్‌ సిస్టమ్‌తో గంటకు 25 నాట్స్‌ వేగంతో ప్రయాణించే సామర్థ్యం. హల్‌ మౌంటెడ్‌ సెన్సర్లతో కూడిన అత్యాధునిక రాడార్‌ వ్యవస్థ. తక్కువ బరువు గల టోర్పిడోలు. యాంటీ సబ్‌మెరైన్‌ రాకెట్లతో సమర్థవంతమైన రక్షణ సామర్థ్యం. సాంకేతిక వివరాలు: నౌక పొడవు: 80 మీటర్లు వెడల్పు: 11.36 మీటర్లు బరువు: 1,100 టన్నులు

Advertisement

వివరాలు

ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి..

నీలగిరి శ్రేణికి చెందిన అత్యాధునిక యుద్ధనౌకల్లో ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి ఒకటి. దీని నిర్మాణాన్ని ముంబయిలోని మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ చేపట్టింది. ఈ నౌక నిర్మాణ కార్యక్రమం 2022 జూన్‌ 28న ప్రారంభమై, 2023 సెప్టెంబర్‌ 1న జలప్రవేశం చేసింది. అన్ని నిర్మాణ, సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాక 2026 ఏప్రిల్‌ 30న భారత నౌకాదళానికి అధికారికంగా అప్పగించారు.

వివరాలు

ప్రత్యేకతలు ఇవే..

బ్రహ్మోస్‌, క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం. 76 ఎంఎం నేవల్‌ గన్‌తో పాటు ట్రిపుల్‌ టోర్పిడో (వరుణాస్త్ర) వ్యవస్థ. రాకెట్‌ లాంఛర్లు. రెండు ధ్రువ్‌ లేదా సీకింగ్‌ హెలికాప్టర్లను నిర్వహించే సదుపాయం. గంటకు 28 నాట్స్‌ వేగంతో ప్రయాణించే సామర్థ్యం. శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాములను సమర్థంగా గుర్తించి లక్ష్యంగా చేసుకునే ఆధునిక వ్యవస్థలు. అత్యాధునిక రాడార్‌, సోనార్‌ సాంకేతికతతో మరింత శక్తివంతమైన రక్షణ సామర్థ్యం. సాంకేతిక వివరాలు: నౌక పొడవు: 149 మీటర్లు వెడల్పు: 17.8 మీటర్లు బరువు: 6,670 టన్నులు

Advertisement