LOADING...
Andhrapradesh : మహిళా దినోత్సవానికి డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలు
మహిళా దినోత్సవానికి డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలు

Andhrapradesh : మహిళా దినోత్సవానికి డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2026
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు మరింత బలమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల పలుమార్లు ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించారు. మహిళలకు అదనపు ప్రయోజనాలు ఎలా అందించాలనే అంశంపై విస్తృతంగా చర్చించారు. అలాగే వారి పిల్లల చదువుకు ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళలను దృష్టిలో ఉంచుకుని రెండు కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకాలను మహిళా దినోత్సవం అయిన మార్చి 8న ప్రారంభించాలనే యోచనలో ఉంది.

వివరాలు 

విద్యా అవసరాలు, వివాహ ఖర్చులకు ఆర్థిక సహాయం

వచ్చే మార్చి 8 నాటికి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం కీలక ప్రకటనలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని రెండు ప్రత్యేక పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. వాటికి ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ అనే పేర్లు పెట్టనున్నారు. ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో విద్యా అవసరాలు, వివాహ ఖర్చులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు గరిష్టంగా లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేయనున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యత్వం ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయి.

వివరాలు 

ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ పథకం

ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లి ఖర్చుల కోసం రుణం పొందవచ్చు. కనీసం రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రుణాన్ని పావలా వడ్డీకే అందించనున్నారు. మొత్తం మొత్తాన్ని 48 నెలల వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. పెళ్లి కార్డు, అంచనా ఖర్చుల వివరాలను సమర్పించడం ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

వివరాలు 

ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ పథకం

ఈ పథకం కింద డ్వాక్రా మహిళలు తమ పిల్లల స్కూల్ లేదా కాలేజీ ఫీజుల కోసం రుణం పొందవచ్చు. ఇద్దరు పిల్లల చదువుకోసం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు లోన్ మంజూరు చేస్తారు. ఇవి కూడా పావలా వడ్డీకే లభిస్తాయి. తీసుకున్న మొత్తాన్ని 48 వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది. ఈ రుణం పొందాలంటే పిల్లల అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు వివరాలు, విద్యాసంస్థ సమాచారం తదితర రసీదులు సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

వివరాలు 

ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ పథకం

ఇటీవల సచివాలయంలో జరిగిన 233వ, 234వ ఎస్ఎల్బీసీ (బ్యాంకర్ల) సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా రుణాల అంశాన్ని ప్రస్తావించారు. డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం చేయాలని బ్యాంకులను కోరారు. డ్వాక్రా గ్రూపుల బ్యాంకు ఖాతాలపై ప్రస్తుతం 15 రకాల ఛార్జీలు వసూలు చేస్తున్నారని, వాటిని తగ్గించాలని బ్యాంకర్లను కోరారు. ఈ అంశంలో కూడా డ్వాక్రా మహిళలకు ఉపశమనం కల్పించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Advertisement