Tamilnadu: మధురై మహిళా హాస్టల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి
తమిళనాడులోని మదురైలో జరిగిన భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. మదురై జిల్లా కాట్రంపళయం ప్రాంతంలో ఉన్న విసాక ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్‌లో ఈరోజు తెల్లవారుజాము 4:30 గంటల సమయంలో ఫ్రిడ్జ్ పేలడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రిడ్జ్ పేలుడు కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఫ్రిజ్ వద్ద నిద్రిస్తున్న ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రమాదం జరిగినప్పుడు హాస్టల్‌లో 40 మందికి పైగా యువతులు
పొగ మంటల వల్ల హాస్టల్‌లోని యువతులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. హాస్టల్‌లో ఉన్న పరిమళ, శరణ్య అనే ఇద్దరు యువతులు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. వీరు గాయాలతో పాటు పొగ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు సమాచారం. మరికొంత మంది పొగ వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సుమారు 20 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పి, హాస్టల్‌లో ఉన్న మహిళలను రక్షించారు. ప్రమాదం జరిగినప్పుడు హాస్టల్‌లో 40 మందికి పైగా యువతులు ఉన్నారు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రిడ్జ్ పేలుడు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినదని పోలీసులు అనుమానిస్తున్నారు.