Loading...
AP Food Cluster: దావోస్‌లో కుదిరిన ఒప్పందానికి కార్యరూపం.. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్

AP Food Cluster: దావోస్‌లో కుదిరిన ఒప్పందానికి కార్యరూపం.. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
04:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి,విదేశీ పెట్టుబడుల ఆకర్షణ దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఈ ఏడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో కుదిరిన ఒప్పందాల్లో ఒకటి ఇప్పుడు అమలు దశలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రంలో సమగ్ర ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం అధికారికంగా చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి చర్చలు జరిపింది. దావోస్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి యూఏఈ సంసిద్ధత ప్రకటించిన విషయం తెలిసిందే.

వివరాలు 

ఏపీ ప్రభుత్వం, యూఏఈ మధ్య అధికారిక భాగస్వామ్యం

ఆ హామీని కార్యరూపంలోకి తీసుకురావడంలో భాగంగానే యూఏఈ ప్రతినిధులు అమరావతికి చేరుకుని తదుపరి కార్యాచరణపై చర్చించారు.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆహార శుద్ధి రంగానికి సంబంధించిన పూర్తి స్థాయి వ్యాల్యూ చైన్‌ను అభివృద్ధి చేయాలని యూఏఈ నిర్ణయించింది.

ఇందుకోసం ఏపీ ప్రభుత్వం, యూఏఈ మధ్య అధికారిక భాగస్వామ్యం కూడా ఖరారైంది.

ఈ భాగస్వామ్యంతో రాష్ట్రంలో పండే మామిడి, అరటి, కోకో వంటి ప్రధాన ఉద్యాన పంటలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ప్యాకింగ్ చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

వివరాలు 

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కొత్త పెట్టుబడులు

ఈ ప్రాజెక్ట్ అమలుతో రైతులకు తమ పంటలకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభించడంతో పాటు, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అదే సమయంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కొత్త పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ కీలక సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఈడీబీ) ప్రతినిధులు, యూఏఈ అధికార ప్రతినిధులు పాల్గొని ప్రాజెక్టు అమలు ప్రణాళికపై చర్చించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ భేటీ

ADVERTISEMENT