Kerala Elections 2026: రూ.25 లక్షల బీమా, రూ.3,000 పెన్షన్‌తో యూడీఎఫ్ ఎన్నికల హామీలు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ అసెంబ్లీ ఎన్నికల పోరు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) గురువారం (ఏప్రిల్ 2న) తన ఎన్నికల ప్రణాళిక పత్రాన్ని విడుదల చేసింది. సమాజంలోని ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు, అభివృద్ధి చర్యలతో కూడిన ఈ మేనిఫెస్టోను కూటమి నాయకులు ప్రజలకు పరిచయం చేశారు. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడంపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రూ.25 లక్షల విలువైన సమగ్ర బీమా సదుపాయం కల్పిస్తామని యూడీఎఫ్ ప్రకటించింది. ఈ పథకం కుటుంబాలకు భద్రతగా నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.డి.సతీశన్ తెలిపారు.
వివరాలు
నెలకు రూ.3,000 పెన్షన్
అదనంగా, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు చిరు వ్యాపారులకు రూ.5 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలను అందిస్తామని వెల్లడించారు. మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(KSRTC) బస్సుల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న సామాజిక భద్రతా పెన్షన్లను నెలకు రూ.3,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే,ఉన్నత విద్య అభ్యసిస్తున్న కాలేజీ విద్యార్థినులకు చదువుల ఖర్చుల కోసం నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు(MSME)మద్దతు ఇవ్వాలని యూడీఎఫ్ ప్రణాళికలో పేర్కొంది. ముఖ్యంగా రూ.100కోట్ల వరకు వార్షిక టర్నోవర్ కలిగిన సంస్థలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
వివరాలు
మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా రంగంపై కూటమి దృష్టి
అలాగే ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది వంటి క్షేత్రస్థాయి సేవా కార్యకర్తల జీతాలను పెంచి, వారి సేవలకు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా రంగంపై కూడా కూటమి దృష్టి సారించింది. విమానయాన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు,వయనాడ్‌లో గిరిజనుల కోసం ప్రత్యేక ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని యూడీఎఫ్ ప్రకటించింది. డిజిటల్ విద్యా సదుపాయాల విస్తరణ,వృత్తి విద్యకు ప్రోత్సాహం, పర్యావరణ అనుకూల పర్యాటకం, సుస్థిర వ్యవసాయ విధానాల ద్వారా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని తెలిపింది. సామాజిక సంక్షేమం, ఆర్థిక పురోగతిని సమన్వయం చేస్తూ కేరళను దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా నడిపిస్తామని యూడీఎఫ్ విశ్వాసం వ్యక్తం చేసింది.