Red Fort Terror Attack: ఎర్రకోట పేలుడు వెనుక జైషే హస్తం: ఐరాస నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ఐక్యరాజ్య సమితి తాజాగా కీలక నివేదికను విడుదల చేసింది. ఈ దాడికి పాకిస్థాన్‌ను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ స్థాయి ఒత్తిడి ఉన్నప్పటికీ జైషే సహా మరికొన్ని ఉగ్రవాద సంస్థలు దక్షిణాసియా ప్రాంతంలో ఇప్పటికీ చురుగ్గా నేర కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఐరాస వెల్లడించింది. ఈ అంశాలను ఐరాస భద్రతా మండలికి సమర్పించిన అధికారిక నివేదికలో ప్రస్తావించింది.
వివరాలు
జైషే కొత్త వ్యూహాల అమలు
ఆ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ జైషే మహ్మద్ పలు ఉగ్రదాడులకు పాల్పడినట్లు సమాచారం అందినట్టు తెలిపింది. అందులో 2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన కూడా ఒకటని ఐరాసలోని ఓ సభ్య దేశం ఆరోపించినట్టు వెల్లడించింది. అంతేకాదు, అంతర్జాతీయ నిఘా వ్యవస్థల నుంచి తప్పించుకునేందుకు జైషే కొత్త వ్యూహాలను అమలు చేస్తోందని పేర్కొంది. గత సంవత్సరం 'జమాత్ ఉల్ ముమినత్' అనే పేరుతో మహిళల విభాగాన్ని ఏర్పాటు చేయడం ఆందోళనకర పరిణామమని నివేదికలో ఐరాస స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని కూడా ఐరాస తన నివేదికలో ప్రస్తావించింది.
వివరాలు
దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మృతి
ఆ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు తెలిపింది. ఇక జైషే మహ్మద్, లష్కరే తయ్యిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఇక ఉనికిలో లేవని పాకిస్థాన్ గత కొంతకాలంగా పదేపదే చెబుతూ వస్తోంది. అయితే తాజా ఐరాస నివేదిక ఆ వాదనలను పూర్తిగా ఖండించడంతో పాటు పాకిస్థాన్ వక్రబుద్ధిని మరోసారి ప్రపంచానికి ఎండగట్టినట్లయ్యింది.
వివరాలు
దాడి వెనుక జైషే మహ్మద్ ప్రమేయం
ఈ నేపథ్యంలో ఈ నివేదికకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఎర్రకోట పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జరిపిన విచారణలో ఇప్పటికే కీలక అంశాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి చేసుకున్న డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించిన వీడియోను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలో భారత్ అంతటా ఆత్మాహుతి దాడులు జరిపేందుకు ఈ ఉగ్ర ముఠా పథకాలు రచించినట్లు స్పష్టమైంది. ఈ అంశాలపై ఎన్‌ఐఏ విచారణ ఇంకా కొనసాగుతోంది.