
TTD: నిరుద్యోగ వేద పండితులకు నెలకు రూ. 3 వేలు భృతి.. ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేద పండితుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 590 మంది వేద పండితులు ప్రస్తుతం నిరుద్యోగంగా ఉన్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇవ్వాలని తితిదే (తిరుమల తిరుపతి దేవస్థానం), దేవాదాయశాఖ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం ఇటీవల తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు. గతంలో సీఎం చంద్రబాబుతో నిర్వహించిన సమీక్షలో ఆలయాల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని, వాటిపై సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
Details
కనకదుర్గమ్మ దేవస్థానానికి మరో రహదారి ఏర్పాటు
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై తితిదే బోర్డు తుది నిర్ణయం తీసుకోనుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి మరో రహదారి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, దీనికి తితిదే సహకారం అవసరమని వివరించారు. అలాగే తితిదే బోర్డులో అన్యమతస్థులు ఉన్నట్టు వస్తున్న ఆరోపణలపై కూడా స్పందించారు. తితిదే బోర్డులో దాదాపు వెయ్యి మంది అన్యమతస్థులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. తితిదే పరిధిలో పనిచేస్తున్న విద్యా సంస్థల లో ఖాళీగా ఉన్న 192 పోస్టుల భర్తీపై కూడా సమీక్షా సమావేశంలో చర్చించామని, త్వరలో భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి ఆనం తెలిపారు.