LOADING...
Andhra Pradesh : కళాశాలల అనుబంధ గుర్తింపునకు ఏకీకృత విధానం.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
కళాశాలల అనుబంధ గుర్తింపునకు ఏకీకృత విధానం.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

Andhra Pradesh : కళాశాలల అనుబంధ గుర్తింపునకు ఏకీకృత విధానం.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు మంజూరు విషయంలో ప్రతి విశ్వవిద్యాలయం ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఈ పరిస్థితిని మార్చి వీటి స్థానంలో ఏకీకృత విధానం అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. డిగ్రీ కళాశాలలతో పాటు జూనియర్‌ కళాశాలలు, పాఠశాలలకు సంబంధించిన అన్ని గుర్తింపు వివరాలను పూర్తిగా డిజిటలైజ్‌ చేశామని తెలిపారు. ఈ వివరాలను జియో ట్యాగింగ్‌, ఫోటోలు, వీడియోలతో సహా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టామని చెప్పారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్‌ సమాధానం ఇస్తూ, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్స్‌లర్లలో ఇప్పటికే మార్పులు చేశామని, త్వరలోనే ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లలో కూడా మార్పులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

వివరాలు 

ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించండి: లోకేష్ 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ, నన్నయ్య విశ్వవిద్యాలయం కుంభకోణాలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. సరైన మౌలిక వసతులు, అర్హత గల అధ్యాపకులు లేకపోయినా కొన్ని కళాశాలలకు గుర్తింపు ఇస్తున్నారని, ఈ వ్యవహారంలో విశ్వవిద్యాలయ అధికారులు పరస్పరం కుమ్మక్కయ్యారని విమర్శించారు. అలాగే వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో ఓ మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తి, మరో మాజీ మంత్రి అనుచరుడిని నియమించుకున్నారని తెలిపారు. వీరంతా కలిసి బినామీ సంస్థలకే టెండర్లు దక్కేలా నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుతున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనికి ప్రతిస్పందించిన మంత్రి లోకేశ్‌, ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తే తప్పకుండా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement