Page Loader
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం
దేశవ్యాప్తంగా 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 6.4 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ అనుసంధానం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 06, 2023
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని చిట్టచివరి గ్రామానికి సైతం ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలోనే భారత గ్రామాలను అనుసంధానించేందుకు ఉద్దేశించిన భారత్‌నెట్‌ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం తాజాగా రూ. 1.39లక్షల కోట్ల భారీ నిధులను కేటాయించేందుకు కేంద్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 6.4లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ (అంతర్జాలం) కల్పించేందుకు చర్యలు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే 1.94లక్షల పల్లెల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌‌ను అనుసంధానించారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేవాలని తాజాగా నిర్ణయించింది.

details

రెండేళ్లలోనే యావత్ దేశంలోని ప్రతి పల్లెకు బ్రాడ్ బ్యాండ్

రానున్న రెండేళ్ల కాలంలో మిగతా భారతానికి బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అనుసంధానించనున్నారు. తొలుత 4 జిల్లాల పరిధిలోని పల్లెలను పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అనుసంధానించారు. అది విజయవంతం కావడంతో ఫైబర్‌ టు హోమ్‌ విధానాన్ని మరింత విస్తరించారు. ఈ మేరకు పలు రాష్ట్రాల్లోని 60వేల గ్రామాలకు విస్తరిస్తూ పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలను సైతం సృష్టించగలమని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలోనే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యానికి మార్గం సుగమం అవుతుందని కేంద్ర మంత్రి వర్గం భావిస్తోంది. అనుసంధాన ప్రక్రియను భారత ప్రభుత్వ రంగ సంస్థ BSNL అనుబంధం భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (BBNL) విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రిన్యూర్ (BLE) సహకారంతో చేపడుతోంది.