Farmers: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం..ఎరువుల సబ్సిడీకి రూ.41,534 కోట్లు మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు రైతులకు అందుబాటు ధరల్లో లభించేందుకు ఎరువులపై ఇచ్చే సబ్సిడీని పెంచింది. ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఫాస్ఫేటిక్, పొటాసిక్ ఎరువులపై రూ.41,534 కోట్ల సబ్సిడీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సబ్సిడీ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP) ధరలు పెరిగినా, రైతులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం ధరలను యథాతథంగా కొనసాగించింది. అందువల్ల 50 కిలోల DAP ఎరువు సంచీ ధర రూ.1,350గానే ఉంటుంది.
వివరాలు
సబ్సిడీతో కూడిన ఎరువులు..
ఎరువులు, వాటి ముడి పదార్థాల అంతర్జాతీయ ధరల మార్పులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ సబ్సిడీ మొత్తాన్ని నిర్ణయించింది. తాత్కాలికంగా రూ.41,533.81 కోట్లుగా కేటాయింపు ఖరారు చేయబడింది. ఇది గత ఖరీఫ్ 2025 సీజన్‌లో కేటాయించిన రూ.37,216.15 కోట్లతో పోలిస్తే సుమారు రూ.4,317 కోట్లు ఎక్కువ. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం రైతులకు తక్కువ ధరలో, సబ్సిడీతో కూడిన ఎరువులు అందించడం. యూరియా, DAP, MOP, సల్ఫర్ వంటి కీలక ముడి పదార్థాల ధరల్లో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని P&K ఎరువుల సబ్సిడీ రేట్లను సవరించారు.
వివరాలు
28 రకాల ఎరువులపై సబ్సిడీ..
న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ (NBS) విధానం ప్రకారం, ఎరువులలో ఉన్న పోషక విలువల ఆధారంగా కంపెనీలకు సబ్సిడీ ఇస్తారు. ఈ విధానం వల్ల DAP, NPKS వంటి ఎరువులు నియంత్రిత ధరలతో రైతులకు నిరంతరంగా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వం తయారీదారులు, దిగుమతిదారుల ద్వారా మొత్తం 28 రకాల ఎరువులను సబ్సిడీపై అందిస్తోంది. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు సరసమైన ధరలో లభించేలా చూడటంలో ప్రభుత్వం తన కట్టుబాటును మరోసారి స్పష్టం చేసింది.