
Union Cabinet: భారత్‌పై అమెరికా 26% సుంకాల వేళ.. క్యాబినెట్ కీలక సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం టారిఫ్‌లు (సుంకాలు) బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి.
ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.
అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ భయాలు పెరుగుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నది.
ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆ భేటీలో చర్చించనున్నారు.
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లలో 10 శాతం అమల్లో ఉంది.
తాజాగా మరో 16 శాతం బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నాయి. ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యల్లో, మోదీ తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నప్పటికీ, భారత్ అమెరికాతో సరైన రీతిలో వ్యవహరించడంలేదని వ్యాఖ్యానించాడు.
వివరాలు
టారిఫ్‌ల వల్ల కొన్ని రంగాలకు మినహాయింపు
భారత్ 52 శాతం సుంకాలు విధిస్తోందని, తమది కేవలం దానిలో సగమే అని ట్రంప్ అన్నారు.
ఈ నేపథ్యంలో,ట్రంప్ విధించిన టారిఫ్‌ల నుండి ఉపశమనం పొందే మార్గాలపై మోదీ ప్రభుత్వం దృష్టిసారించింది.
అయితే,ఈ చర్యలు పరస్పర ప్రతీకారంగా కాకూడదన్న అభిప్రాయంతో ముందడుగులు వేస్తోంది.
అటువంటి పరస్పర అవగాహన ఒప్పందాల దిశగా సిద్ధమవుతుందని ఒక ప్రభుత్వ అధికారి ఇటీవల వ్యాఖ్యానించారు.
ఈ టారిఫ్‌ల వల్ల కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చారు.సెమీకండక్టర్లు,రాగి, ఔషధాలపై సుంకాల నుంచి మినహాయింపు లభించింది.
కానీ ఆటో విడిభాగాలు, రత్నాలు, ఆభరణాలు వంటి కీలక రంగాల్లో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం నిర్వహించే సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.