Personal Data Protection Bill: వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సీఎస్‌బీసీ వెల్లడించింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ బిల్లును గత ఏడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ క్రమంలో మిత్రపక్షాల సూచన మేరకు బిల్లులో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. బిల్లు పూర్తిగా రెడీ అయిన తర్వాత బుధవారం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి 2018లో జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ డేటా రక్షణ బిల్లు డ్రాఫ్ట్‌ను రూపొందించారు. అయితే అది అనేక విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో కేంద్రం ఆ డ్రాఫ్ట్‌ను ఉపసంహరించుకున్నది.
ఈ బిల్లులోని కీలక అంశాలు
బిల్లులోని నిబంధనల ప్రకారం ఒకరి వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తే రూ. 500కోట్ల వరకు జరిమానా విధిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. బిల్లులోని నిబంధనలు సక్రమంగా అమలులో ఉన్నాయని నిర్ధారించడానికి, డేటా రక్షణ బోర్డు ఏర్పాటు చేయబడుతుంది. ప్రజల ఇబ్బందులను ఇది పరిష్కరిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వ్యక్తిగత డేటాను అప్డేట్ చేయడానికి లేదా తొలగించడానికి వినియోగదారులకు హక్కు ఉంటుంది. మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకు హాని కలిగించే ఏదైనా డేటాకు తల్లిదండ్రుల సమ్మతి అవసరం. సోషల్ మీడియా కంపెనీలు పిల్లల డేటాను ట్రాక్ చేయడం లేదని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి. ఏదైనా కంపెనీలో హాజరు అవసరాల కోసం ఉద్యోగి బయోమెట్రిక్ డేటా అవసరమైతే, దానికోసం ఉద్యోగి అనుమతిని కోరవలసి ఉంటుంది.