దేశవ్యాప్తంగా వడగాలులతో పెరుగుతున్న మరణాలు; కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సమావేశం
జూన్ మూడో వారంలో కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా ఎండలతో పాటు వడగాలులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. ఈ వేడిగాలకు తట్టుకోలేక అనేక మంది చనిపోతున్నారు. ఈ క్రమంలో విపరీతమైన ఎండలు, వడగాలుల నేపథ్యంలో ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం ఉదయం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డాక్టర్ వీకే పాల్(ఆరోగ్యం), నీతి ఆయోగ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బాహ్ల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఐఎండీ నిపుణులు హాజరయ్యారు. గత మూడు రోజుల్లోనే వడదెబ్బకు బిహార్, ఉత్తరప్రదేశ్‌లో కనీసం 98 మంది మరణించారని ఇండియా టుడే నివేదించింది.
మరో రెండురోజులు పాటు తీవ్రమైన ఎండలు
రాబోయే రెండు రోజులు కూడా తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. దిల్లీ, పంజాబ్, హర్యానాలో రానున్న రెండు రోజుల్లో 40-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ శాస్త్రవేత్త నరేష్ కుమార్ తెలిపారు. మండిపోతున్న ఎండల కారణంగా పట్నాలో 12వ తరగతి వరకు అన్ని విద్యా కార్యకలాపాలను జిల్లా మేజిస్ట్రేట్ సస్పెండ్ చేశారు. జూన్ 24 వరకు ఈ ఆదేశాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.