Zika Virus: జికా వైరస్‌పై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం
మహారాష్ట్రలో జికా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక జారీ చేసింది. ఇండియా టుడే ప్రకారం, ఏడెస్ దోమలు లేకుండా ప్రాంగణాన్ని పర్యవేక్షించే ఒక నోడల్ అధికారిని నియమించాలని మంత్రిత్వ శాఖ ఆరోగ్య సేవలు, ఆసుపత్రులను ఆదేశించింది. అలాగే, నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ ప్రదేశాల్లో వెక్టర్ నియంత్రణ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని రాష్ట్రాలను కోరింది.
గర్భిణుల విషయంలో జాగ్రత్త వహించాలి
ముఖ్యంగా గర్భిణుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది. మహిళల్లో ఇన్ఫెక్షన్‌పై విచారణ జరిపించాలని కోరారు. గర్భిణీ స్త్రీకి జికా సోకిందని తేలితే, ఆమె పిండం అభివృద్ధిని పర్యవేక్షించడం ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. రాష్ట్రాలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. ఈ విషయాన్ని స్వయంగా పరిశీలిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ చెబుతోంది.
మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదు
మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పూణేలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. జులై 1న పూణేలో ఇద్దరు గర్భిణులు సహా 6 మందికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. నగరంలోని ఎరంద్‌వానే ప్రాంతంలో 4, ముంధ్వా ప్రాంతంలో 2 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు జూన్ 26 న, డాక్టర్, అతని కుమార్తెలో కూడా ఇన్ఫెక్షన్ కనుగొన్నారు. 2023లో కూడా మహారాష్ట్రలో మొత్తం 10 కేసులు నమోదయ్యాయి.
జికా వైరస్ అంటే ఏమిటి?
జికా వైరస్ ప్రధానంగా ఏడిస్ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది, దీంతో డెంగ్యూ, చికున్‌గున్యాను కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఫ్లావివిరిడే వైరస్ కుటుంబానికి చెందినది, ఇది మొదట 1947లో ఉగాండాలోని జికా అడవిలో కోతులలో కనుగొనబడింది. అందుకే దీనికి 'జికా' అని పేరు పెట్టారు. మానవులలో మొదటి కేసు 1952 లో కనుగొన్నారు. వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు. మిగిలిన రోగులలో జ్వరం, శరీర నొప్పి, కంటి చికాకు , చర్మంపై దద్దుర్లు వంటి తేలికపాటి లక్షణాలు ఉంటాయి.
జికా వైరస్ బారిన పడే ప్రమాదం ఎవరికి ఉంది?
జికా వైరస్ సంక్రమణ చాలా తక్కువ మరణాల రేటును కలిగి ఉంది, అయితే ఇది గర్భిణీ స్త్రీలకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. వారికి ఇన్ఫెక్షన్ సోకితే కడుపులో ఉన్న బిడ్డ మైక్రోసెఫాలీ వంటి మానసిక సమస్యలతో బాధపడవచ్చు. మైక్రోసెఫాలీ అనేది పిల్లల మెదడు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం లేదా అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి. కండరాల బలహీనత,పక్షవాతం కలిగించే నరాల రుగ్మతలతో కూడిన అరుదైన సిండ్రోమ్ కూడా కొంతమంది సోకిన వ్యక్తులలో కనిపించింది.