Loading...
Pradhan Resigns:నైతిక బాధ్యతతో పదవులు వీడిన కేంద్ర మంత్రులు.. భారత రాజకీయ చరిత్రలో నిలిచిన రాజీనామాలు
నైతిక బాధ్యతతో పదవులు వీడిన కేంద్ర మంత్రులు.. భారత రాజకీయ చరిత్రలో నిలిచిన రాజీనామాలు

Pradhan Resigns:నైతిక బాధ్యతతో పదవులు వీడిన కేంద్ర మంత్రులు.. భారత రాజకీయ చరిత్రలో నిలిచిన రాజీనామాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వతంత్ర భారత చరిత్రలో పలు సందర్భాల్లో కేంద్ర మంత్రులు తమ శాఖల్లో జరిగిన ప్రమాదాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు లేదా ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేశారు. కొన్నిసార్లు వారి ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా బాధ్యత స్వీకరించి తప్పుకోవడం దేశ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టాలుగా నిలిచిపోయింది. లాల్‌బహదూర్‌ శాస్త్రి నుంచి తాజాగా ధర్మేంద్ర ప్రధాన్‌ వరకు రాజీనామా చేసిన ప్రముఖ కేంద్ర మంత్రుల వివరాలు ఇవే.

వివరాలు 

1. లాల్‌బహదూర్‌ శాస్త్రి (1956) - రైల్వే మంత్రి

భారత రాజకీయ చరిత్రలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన తొలి కేంద్ర మంత్రిగా లాల్‌బహదూర్‌ శాస్త్రి నిలిచారు.

తమిళనాడులోని అరియలూర్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో ఆయన రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు.

వివరాలు 

2. టీటీ కృష్ణమాచారి (1958, 1965) - ఆర్థిక మంత్రి

1958లో జీవిత బీమా సంస్థ (LIC) తన రూ.1.26 కోట్ల నిధులను స్టాక్‌ మార్కెట్‌ స్పెక్యులేటర్‌ హరిదాస్‌ ముంద్రా నియంత్రణలోని కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టిన వ్యవహారంపై చాగ్లా కమిషన్‌ నివేదిక అనంతరం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.

1965లో రెండోసారి, తన పదవిని ఉపయోగించి కుమారుడి వ్యాపారాలకు లబ్ధి చేకూర్చారనే ఆరోపణలపై ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి దర్యాప్తునకు ఆదేశించడంతో మరోసారి పదవికి రాజీనామా సమర్పించారు.

3. వీ.కే. కృష్ణ మేనన్‌ (1962) - రక్షణ మంత్రి

1962లో భారత్‌-చైనా యుద్ధంలో భారత సైన్యం తగిన స్థాయిలో సిద్ధంగా లేకపోయిందనే తీవ్ర విమర్శల నేపథ్యంలో రక్షణ మంత్రి వీ.కే. కృష్ణ మేనన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

4. వీపీ సింగ్‌ (1987) - రక్షణ మంత్రి

రక్షణ కొనుగోలు ఒప్పందాల్లో కమీషన్ల అంశంపై విచారణకు ఆదేశాలు జారీ కావడంతో అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ సూచన మేరకు వీపీ సింగ్‌ మంత్రి పదవిని వీడారు.

5. మాధవరావు సింధియా (1993) - పౌర విమానయాన మంత్రి

ఢిల్లీ విమానాశ్రయంలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదం జరిగిన తర్వాత, ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడినప్పటికీ నైతిక బాధ్యత స్వీకరిస్తూ మాధవరావు సింధియా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు రాజీనామా లేఖ పంపించారు.

ADVERTISEMENT

వివరాలు 

6. నీతీశ్‌ కుమార్‌ (1999) - రైల్వే మంత్రి

పశ్చిమ బెంగాల్‌లోని గైసల్‌ వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో సుమారు 300 మంది మరణించడంతో రైల్వే మంత్రి నీతీశ్‌ కుమార్‌ బాధ్యత వహిస్తూ అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి రాజీనామా సమర్పించారు.

7. మమతా బెనర్జీ (2000) - రైల్వే మంత్రి

పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీకొని 43 మంది మరణించిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు.

వివరాలు 

8. నట్వర్‌ సింగ్‌ (2005) - విదేశాంగ మంత్రి

ఇరాక్‌ ఆయిల్‌ ఫర్‌ ఫుడ్‌ కుంభకోణంలో ఆయనకు లబ్ధి చేకూరిందని ఓల్కర్‌ కమిటీ నివేదికలో పేర్కొనడంతో విదేశాంగ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

9. శివరాజ్‌ పాటిల్‌ (2008) - హోంమంత్రి

2008లో ముంబయిపై జరిగిన ఉగ్రవాద దాడుల అనంతరం నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి శివరాజ్‌ పాటిల్‌ తన పదవికి రాజీనామా చేశారు.

10. ఎ. రాజా (2010)-కమ్యూనికేషన్స్‌ మంత్రి

2జీ స్పెక్ట్రం కేటాయింపులో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి ఎ. రాజా రాజీనామా చేశారు.

11.శశి థరూర్‌ (2010)-విదేశాంగ శాఖ సహాయ మంత్రి

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ బిడ్‌ వివాదంలో చిక్కుకోవడంతో విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశి థరూర్‌ తన పదవిని వదిలారు.

వివరాలు 

12. దయానిధి మారన్‌ (2011) - జౌళి శాఖ మంత్రి

కమ్యూనికేషన్స్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్‌సెల్‌ ప్రమోటర్‌పై ఒత్తిడి తెచ్చి మాక్సిస్‌ సంస్థకు వాటాలు విక్రయించేలా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో దయానిధి మారన్‌ రాజీనామా చేశారు.

13. దినేష్‌ త్రివేది (2012) - రైల్వే మంత్రి

రైల్వే ఛార్జీల పెంపుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తం కావడంతో, అప్పటి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ఆదేశాల మేరకు దినేష్‌ త్రివేది మంత్రి పదవిని వీడారు.

14. పవన్‌ కుమార్‌ బన్సల్‌ (2013) - రైల్వే మంత్రి

రైల్వే కాంట్రాక్టుకు సంబంధించిన టెండర్‌లో తన సమీప బంధువు లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలు రావడంతో పవన్‌ కుమార్‌ బన్సల్‌ రాజీనామా చేశారు.

వివరాలు 

15. అశ్వినీ కుమార్‌ (2013) - న్యాయ శాఖ మంత్రి

బొగ్గు కుంభకోణానికి సంబంధించిన సీబీఐ స్థితి నివేదికను పరిశీలించి అందులో మార్పులు చేయించేలా ప్రభావితం చేశారనే ఆరోపణలతో న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్‌ పదవిని వీడారు.

16. ధర్మేంద్ర ప్రధాన్‌ (2026) - విద్యాశాఖ మంత్రి

నీట్‌ (NEET) ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 2026లో తన పదవికి రాజీనామా చేశారు.

స్వతంత్ర భారత చరిత్రలో వివిధ కాలాల్లో చోటుచేసుకున్న ఈ రాజీనామాలు రాజకీయ బాధ్యత, ప్రజాస్వామ్య విలువలు, నైతికతపై ఎప్పటికప్పుడు చర్చకు దారితీశాయి.

ADVERTISEMENT