LOADING...
Govt Schools: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు స్టార్‌ రేటింగ్‌.. ఆరు కొలమానాల ఆధారంగా నిర్ణయం
ఆరు కొలమానాల ఆధారంగా నిర్ణయం

Govt Schools: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు స్టార్‌ రేటింగ్‌.. ఆరు కొలమానాల ఆధారంగా నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో పచ్చదనం,పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర విద్యాశాఖ కొత్త స్టార్‌ రేటింగ్‌ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ పద్ధతిలో మార్పులు చేసి, దాని స్థానంలో స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయ రేటింగ్‌ (SHVR) అనే కొత్త విధానాన్ని ప్రారంభించారు. ఈ పద్ధతిలో మొత్తం ఆరు ప్రధాన కొలమానాల కింద 60 సూచికలను పరిశీలించి, ప్రతి పాఠశాలకు ఒకటి నుండి ఐదు స్టార్‌ల వరకు రేటింగ్‌ ఇవ్వబడుతుంది.

వివరాలు 

స్వయంగా పరిశీలన - రేటింగ్‌ కేటాయింపు 

ఈ SHVR విధానం ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు (1వ తరగతి నుండి 10వ తరగతి వరకు) వర్తిస్తుంది. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (HM) లేదా ప్రిన్సిపాల్‌ సెప్టెంబర్‌ 30 లోపు SHVR పోర్టల్‌లో అవసరమైన సమాచారం నమోదు చేయాలి. ప్రతీ సూచికకు సంబంధించిన ఆధారాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ వివరాలను పరిశీలకులు స్వయంగా పాఠశాలకు వచ్చి పరిశీలిస్తారు. పరిశీలన అనంతరం, ఒక్కో పాఠశాలకు 1 నుండి 5 స్టార్‌లలో ఏదో ఒక రేటింగ్‌ కేటాయిస్తారు.

వివరాలు 

జాతీయస్థాయి గుర్తింపు - నగదు ప్రోత్సాహం 

దేశవ్యాప్తంగా సుమారు 14.75 లక్షల పాఠశాలలు ఉన్న నేపథ్యంలో, ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. జిల్లా స్థాయి ఎంపిక: ఒక్కో జిల్లా నుండి 8 పాఠశాలలను రాష్ట్రస్థాయికి పంపిస్తారు. రాష్ట్ర స్థాయి ఎంపిక: రాష్ట్ర స్థాయిలో గరిష్ఠంగా 20 పాఠశాలలకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. ఆ పాఠశాలలను జాతీయ స్థాయికి సిఫారసు చేస్తారు. జాతీయ స్థాయి ఎంపిక: ఎంపికైన పాఠశాలలకు ఒక్కింటికి రూ.1 లక్ష నగదు ప్రోత్సాహకంగా ఇస్తారు. అదనంగా, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్లకు దేశంలోని ప్రముఖ సంస్థలను 3 రోజులపాటు సందర్శించే ప్రత్యేక అవకాశం కల్పిస్తారు.

వివరాలు 

2025-26 లక్ష్యం - పచ్చదనం,పరిశుభ్రత 

SHVR 2025-26 ముఖ్య ఉద్దేశ్యం పాఠశాలలను పచ్చదనం, పరిశుభ్రత మరియు పర్యావరణ సుస్థిరతకు ఆదర్శంగా మార్చడం. అలాగే విద్యార్థుల్లో ఈ అంశాలపై అవగాహన పెంచడం. దీనికి ఆరు ప్రధాన కొలమానాలు నిర్ణయించారు. వాటిలో.. తాగునీటి అందుబాటు, వాననీటి సంరక్షణ, శౌచాలయాల సౌకర్యం & శుభ్రత, చేతులు కడుక్కోవడానికి సబ్బు వినియోగం, వ్యర్థాల సమర్థమైన నిర్వహణ, మొక్కల పెంపకం & పచ్చదనం, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించడం, విద్యుత్‌ సదుపాయం మెరుగుదల ఇలా మొత్తం 60 సూచికల ఆధారంగా రేటింగ్‌ కేటాయిస్తారు.