Narendra Modi: ఐక్యతే భద్రతకు మూలం.. ప్రజలు ఐక్యంగా ఉండాలి: ప్రధాని మోదీ
కాంగ్రెస్-జేఎంఎం ప్రజల్లో విభజన రేకెత్తించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో భాగంగా ఆయన మాట్లాడారు. ఓబీసీ, గిరిజన, దళితుల ఐక్యతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ చర్యలు చేపడుతోందని, ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐక్యత మాత్రమే భద్రతను కల్పిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో కేంద్రంలో అధికారం చేపట్టడానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్, జేఎంఎంలు అధికార దాహంతో ఎన్ని కుతంత్రాలు పన్నుతాయో ప్రజలు జాగ్రత్తగా గమనించాలన్నారు.
ఓబీసీలపై కాంగ్రెస్ దుష్పచారం
ఛోటానాగ్‌పూర్ ప్రాంతంలో 125కిపైగా ఉపకులాలు ఓబీసీలుగా గుర్తింపు పొందాయని, ఈ ఉపకులాలను విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్-జేఎంఎంలు చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఐక్యతే భద్రతకు మూలమని మోదీ చెప్పారు. అనంతరం కశ్మీర్ అంశంపై మాట్లాడారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు ప్రయత్నిస్తున్నాయని, అదే జరిగితే సైనికులు మళ్లీ ఉగ్రవాద దాడులకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆర్టికల్ 370ను తీసుకొచ్చి, ఏడు దశాబ్దాలపాటు రాజ్యాంగం అమలు జరగకుండా చేసిందని మోదీ అన్నారు. భారత రాజ్యాంగం అమలులో ఉన్నందువల్లే మొదటిసారిగా జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినట్లు పేర్కొన్నారు.