Winter Season: ఈసారి తక్కువగానే చలి.. భారత వాతావరణ శాఖ అంచనా
వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం చలి తక్కువగా ఉంది. డిసెంబరు నెల ప్రారంభమైనప్పటికీ అనేక ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి లేదు. నవంబరులో, చాలా ప్రాంతాలలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఉత్తర, వాయవ్య, తూర్పు భారతదేశంలో చలిగాలుల వాతావరణం ఏర్పడలేదు. ఇదే తరహా వాతావరణం డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు మూడు నెలల శీతాకాలంలో కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తప్ప, దేశం మొత్తం గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయని అధికారులు చెప్పారు.
చలిని స్వల్పంగా పెంచే అవకాశం
ఈ పరిణామం వలన గజగజ వణికించే వాతావరణం తక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్పారు. వాతావరణంలో మార్పుల వల్లనే చలిగాలుల తీవ్రత తగ్గిపోయినట్లు వారు పేర్కొన్నారు. అయితే, పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న తటస్థ పరిస్థితుల కారణంగా ఈ నెల చివరలో లేదా జనవరిలో 'లానినా' పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం చలిని స్వల్పంగా పెంచే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.