UP Elections 2027: యూపీలో సీట్ల పంచాయితీ.. కాంగ్రెస్‌కు 55 స్థానాలేనా? ఎస్పీ ప్రతిపాదనతో కొత్త చిక్కులు!
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో ఇప్పటికే కూటమిగా ఏర్పడిన ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు సీట్ల పంపకాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశం చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు పార్టీల నేతలు తొలిదశ చర్చల్లో భాగంగా ఢిల్లీలో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీ కేవలం 15 నిమిషాల్లోనే ముగియడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
మూడ్రోజుల్లో సీట్ల పంపకాలపై స్పష్టత!
కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎస్పీ నుంచి నలుగురేసి నేతలు హాజరయ్యారు.
కాంగ్రెస్ తరఫున యూపీ పార్టీ ఇన్‌ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్, రాష్ట్ర అధ్యక్షురాలు ఆరాధన మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్, శాసనసభా పక్ష నేత వీరేంద్ర చౌదరి పాల్గొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌లాల్ పాల్, ఎంపీలు రాజీవ్ రాయ్, ఇక్రా హసన్ చర్చల్లో పాల్గొన్నారు.
సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని యూపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరాధన మిశ్రా వెల్లడించారు.
రాబోయే రెండు, మూడు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు ఒక కొలిక్కి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వివరాలు
100కు పైగా స్థానాలపై కాంగ్రెస్ గురి
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ కూటమికి అనుకూలంగా ఉన్న కనీసం 60 ఏ-గ్రేడ్ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
అదే సమయంలో బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎస్పీ తమకు 40 నుంచి 45 స్థానాలు మాత్రమే కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దీంతో మొత్తం మీద 100కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని హస్తం పార్టీ ప్రయత్నిస్తోంది.
2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు సుమారు 105 స్థానాలు కేటాయించింది.
ఈ విషయాన్ని గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఈసారి కూడా కనీసం 100 స్థానాల మార్కును దాటాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఎక్కువ స్థానాలు ఎందుకు కావాలంటున్న కాంగ్రెస్?
సీట్ల సంఖ్య మాత్రమే కాకుండా, గెలిచే అవకాశాలు కూడా తమకు ముఖ్యమని చర్చల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు.
యాదవేతర, ముస్లిమేతర ఓటర్లను తమవైపు ఆకర్షించాలంటే బలమైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ముఖ్యంగా దళితులు, బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన తరగతుల ఓటర్ల మద్దతు పొందేందుకు ఎక్కువ సంఖ్యలో గెలుపు అవకాశాలున్న స్థానాల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని వాదిస్తోంది.
ఈ వర్గాల ఓట్లను కూటమికి అనుకూలంగా మలుచుకోవాలంటే కాంగ్రెస్‌కు గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ఏకంగా 181 నియోజకవర్గాలతో కూడిన జాబితాను సమాజ్‌వాదీ పార్టీకి పంపినట్లు సమాచారం.
అయితే ఈ ప్రతిపాదనపై ఎస్పీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
వివరాలు
కాంగ్రెస్‌కు 55 స్థానాలే ఆఫర్ చేసిన ఎస్పీ?
మరోవైపు సీట్ల సంఖ్య కంటే ఎన్నికల్లో గెలుపునకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భావిస్తున్నారు.
ఈ ఎన్నికలు సమాజ్‌వాదీ పార్టీకి అత్యంత కీలకమని, పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే పోరాటంగా ఆయన చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ప్రత్యేకమైన ఓటు బ్యాంకు లేదని ఎస్పీ నేతలు వాదిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచిందని, ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కూడా రెండు మాత్రమేనని ఓ ఎస్పీ ఎంపీ వ్యాఖ్యానించారు.
వివరాలు
కాంగ్రెస్‌కు 55 స్థానాలే ఆఫర్ చేసిన ఎస్పీ?
ఈ నేపథ్యంలో ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టకుండా.. గత ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన నియోజకవర్గాలపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టాలని ఎస్పీ భావిస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌కు సుమారు 55 స్థానాలు కేటాయించేలా సమాజ్‌వాదీ పార్టీ ఓ జాబితాను పంపినట్లు తెలుస్తోంది.
దీంతో కాంగ్రెస్ కోరుతున్న 100కు పైగా స్థానాలకు, ఎస్పీ ప్రతిపాదిస్తున్న 55 స్థానాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి.