UP ATS: భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ ఏజెంట్.. మీరట్‌లో అరెస్టు
దేశ రక్షణకు సంబంధించి సంచలన ఘటన వెలుగు చూసింది. రష్యాలోని మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యేంద్ర సివాల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. సివాల్ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)కి గూఢాచారిగా పని చేస్తునట్లు ఏటీఎస్ గుర్తించింది. భారత రాయబార కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత సైనిక సంస్థల ముఖ్యమైన రహస్య సమాచారాన్ని ఐఎస్‌ఐకి సివాల్ అందజేశారు. 2021 నుంచి రష్యాలోని ఇండియన్ ఎంబసీలో ఇండియా బెస్ట్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఐబీఎస్‌గా సత్యేంద్ర పని చేస్తున్నట్లు ఏటీఎస్ ఏడీజీ తెలిపారు. సతేంద్ర హాపూర్‌లోని షమహియుద్దీన్‌పూర్ నివాసిగా వెల్లడించారు.
విచారణలో గూఢచర్యాన్ని అంగీకరించిన సత్యేంద్ర
సత్యేంద్ర సివాల్ భారతీయ ఉద్యోగులకు డబ్బు ఎర చూపి.. రక్షణకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించి పాక్ కు చేరవేస్తున్నట్లు ఏటీఎస్‌కు సమాచారం అందింది. ఈ క్రమంలో సతేంద్రపై ఏటీఎస్ ఓ కన్నేసి ఉంచి అతడి మొబైల్‌పై కూడా నిఘా పెట్టింది. ఈ క్రమంలో అతని కదలికలపై అనుమానం వచ్చి.. సతేంద్రను మీరట్‌కు పిలిచి విచారించింది. ఈ క్రమంలో సత్యేంద్ర సరైన సమాధానాలు ఇవ్వలేకపోయాడు. విచారణ అధికారులు తమదైన శైలిలో కఠినంగా విచారించగా.. తన నేరాన్ని అంగీకరించాడు. సతేంద్ర నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, రూ.600 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై సెక్షన్ 121(A), అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేశారు.