Chandrababu Naidu: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.50 లక్షల వరకు నజరానా.. చంద్రబాబు కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, రాబోయే పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాల అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పురపాలక, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమికి లభించిన విజయం రెండున్నరేళ్ల పాలనకు దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాయని, పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజల నుంచి ఏకపక్షంగా వచ్చిన అభిప్రాయాన్ని గొడ్డలి పార్టీ జీర్ణించుకోలేకపోతోందని చంద్రబాబు విమర్శించారు.
వివరాలు
పంచాయతీల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహం
గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు మంత్రులు, పార్టీ నేతలకు సూచించారు.
ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభా ఆధారంగా ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నిధుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.
5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు: రూ.15 లక్షలు
5 వేల నుంచి 10 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలకు: రూ.25 లక్షలు
10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు: రూ.50 లక్షలు గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు కనిష్టంగా రూ.5 లక్షలు మాత్రమే నజరానాగా ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.15 లక్షలకు పెంచినట్లు చంద్రబాబు వెల్లడించారు.
గతంలో గరిష్ఠంగా రూ.20 లక్షలుగా ఉన్న ప్రోత్సాహకాన్ని ఇప్పుడు రూ.50 లక్షలకు పెంచినట్లు వివరించారు.