యూపీ: అక్రమ ఆయుధాల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి? రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
లైసెన్సు లేని తుపాకుల వల్ల కలిగే అనార్థాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అక్రమ ఆయుధాలను కలిగి ఉండటం, వాటిని వాడటం లాంటి విషయాల్లో నమోదైన కేసులు, అలాంటి సంఘటనలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలపై పూర్తి సమాచారం అందించాలని నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. యూపీలో లైసెన్స్ లేని ఆయుధంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఒకరిని హత్య చేసిన కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను పరిశీలించే సందర్భంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది
భారత రాజ్యాంగ నిర్మాతలు ఆ హక్కును అందించకుండా జాగ్రత్తపడ్డారు: సుప్రీంకోర్టు
ఆయుధ చట్టం కింద లైసెన్స్ లేని తుపాకీలకు సంబంధించి పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేశారో తెలుసుకోవడం వల్ల రాష్ట్రంలో ఈ ధోరణిపై స్పష్టమైన అవగాహన వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అందుకే ప్రభుత్వం నుంచి కేసులకు సంబంధించిన వివరాలను కోరినట్లు వెల్లడించింది. అమెరికాలో ఆయుధాలు కలిగి ఉండటం రాజ్యాంగం హక్కని, అయితే దాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు అందించకుండా జాగ్రత్తపడినట్లు ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితుడు, పిటిషనర్ రాజేంద్ర సింగ్‌కు అలహాబాద్ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వయస్సు 73 ఏళ్లని, ఐదేళ్లకు పైగా జైలులో ఉన్నానని రాజేంద్ర సింగ్‌కు చెప్పారు. వయోభారం కారణంగా వైద్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.