Sonia Gandhi: వందేమాతరం విషయంలో సోనియా గాంధీ తీరుపై దుమారం.. ఇరకాటంలో కాంగ్రెస్
ఈ వార్తాకథనం ఏంటి
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ కాంగ్రెస్ అగ్రనేత, సీపీపీ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి సంబంధించిన ఓ వీడియో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం 'వందేమాతరం' గేయాలాపన జరుగుతుండగా.. దాన్ని మధ్యలోనే నిలిపివేయాలని సోనియా గాంధీ సూచించినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో 'వందేమాతరం' కొనసాగుతుండగానే సోనియా గాంధీ 'ఆపండి' అన్నట్లుగా చేతులతో సైగలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అనంతరం పక్కనే ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో ఆమె అసహనంగా మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
వివరాలు
నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు
'వందేమాతరం'ను మధ్యలోనే అడ్డుకోవడం ద్వారా జాతీయ గేయాన్ని అవమానించారని నెటిజన్లు, విపక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 'వందేమాతరం' పట్ల కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ఉన్న గౌరవం ఇదేనా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
ఏదైనా సమస్య లేదా ప్రోటోకాల్‌కు సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పటికీ.. దేశభక్తికి ప్రతీకగా భావించే గేయం పూర్తయ్యే వరకు కనీస గౌరవంతో నిలబడకుండా మధ్యలోనే ఆపించడం సరికాదని విమర్శకులు అంటున్నారు.
దీంతో ఈ వీడియో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
వివరాలు
వీడియోపై మరో వాదన
అయితే ఈ వీడియో ఆధారంగా వస్తున్న ఆరోపణలను కొందరు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు.
సోనియా గాంధీ 'వందేమాతరం'ను ఆపాలని చెప్పలేదని, వీడియోలో కనిపిస్తున్న దృశ్యం మరో సందర్భానికి సంబంధించినదని ఆమెకు మద్దతుగా నిలుస్తున్న వారు చెబుతున్నారు.
దీంతో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని వాస్తవం ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందిస్తేనే అసలు విషయం తేలే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మొత్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ సోనియా గాంధీకి సంబంధించిన ఈ వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.